Begin typing your search above and press return to search.

కుంప‌టి రాజుకుంటోంది బాబు

By:  Tupaki Desk   |   6 Jan 2016 10:08 AM GMT
కుంప‌టి రాజుకుంటోంది బాబు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌భూమి- మా ఊరు పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకొని పర్య‌టిస్తుంటే ఆయ‌న‌కు పోటీగా మ‌రో యాత్ర సిద్ధ‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో నివురుగ‌ప్పిన నిప్పులాగా ఉన్న రాయలసీమ - ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశం ఇపుడు తాజాగా యాత్ర‌ల రూపం దాల్చింది. సీమ‌ - ఉత్త‌రాంధ్ర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని పది వామపక్షాలు నిర్ణయించాయి.

విజయవాడ పది వామపక్షాల పార్టీల అగ్రనేత‌లు సమావేశం ఏర్పాటుచేసుకొని రాయలసీమ - ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను చర్చించారు. సీమ వాసి అయిన చంద్ర‌బాబు ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుప‌డ‌టం లేద‌ని...వెన‌క‌బడిన ఉత్త‌రాంధ్ర ఊసెత్త‌డం లేద‌ని నాయ‌కులు మండిప‌డ్డారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో నీటి వనరులు - కరవు - ఉపాధి - వలసలు - పరిశ్రమల స్థాపన తదితర సమస్యలపై బస్సుయాత్ర చేపట్టాలని తీర్మానించారు. బస్సుయాత్ర కంటే ముందుగా సీమ జిల్లాల్లో పాదయాత్రలు - సదస్సులతో ఆందోళనలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర సమస్యలను చర్చించి బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ‌మైన మొదటి వారంలో "చలో అసెంబ్లీ"కి పిలుపునివ్వాలని సమావేశం తీర్మానించింది.

దీంతోపాటు తెలంగాణ నుంచి ఏపీలోకి విలీనమైన మండలాల్లో ఈ నెల 17 -18 తేదీల్లో పర్యటించాలని పది వామపక్షాల నాయకులు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపైనా ఆందోళన చేయాలని తీర్మానించారు. విశాఖలో బాక్సైట్‌ తవ్వకానికి వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న ఆందోళన ప్రాంతాలలో పర్యటించి ప్రత్యక్షంగా కూడా మద్ధతు తెలపాలని వామపక్షాలు నిర్ణయించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనకు పెద్ద ఎత్తున ప్రజలను కదిలించాల‌ని నిర్ణ‌యించారు.

త్వ‌ర‌లో చంద్ర‌బాబు పెట్టుబ‌డుల స‌మావేశం - విదేశీ ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్న నేప‌థ్యంలో సొంత రాష్ర్టంలోనే యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌డం అందులో చంద్ర‌బాబు మాతృగ‌డ్డ‌ను మ‌రిచిపోయారంటూ ప్రచారం చేయ‌డం ఆయ‌న‌కు ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం ఏ విధంగా ముంద‌డుగు వేస్తారో చూడాలి మ‌రి.