Begin typing your search above and press return to search.

ఆ ఫ్యామిలీలో ఎవ‌రు ట‌చ్ చేసినా వెలుగుతున్న బ‌ల్బ్‌!

By:  Tupaki Desk   |   27 July 2019 4:26 AM GMT
ఆ ఫ్యామిలీలో ఎవ‌రు ట‌చ్ చేసినా వెలుగుతున్న బ‌ల్బ్‌!
X
ఇప్పుడో విచిత్ర‌మైన కుటుంబం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అదిలాబాద్ జిల్లా బేల మండ‌లం సిర్స‌న్న గ్రామానికి చెందిన కుటుంబం ఇప్పుడు సైన్సు కే కొత్త ప్ర‌శ్న‌లు వేసేలా మారింది. ఆ ఇంట్లోని కుటుంబ స‌భ్యులంతా ప‌వ‌ర్ ప్యాక్ వ్య‌క్తులుగా మారారు. వారు ముట్టుకుంటే చాలు ఎల్ ఈడీ బ‌ల్బ్ లు వెలుగుతున్నాయి.

ముక్కు.. నుదురు.. చేయి.. కాలు.. శ‌రీరంలో ఏ భాగంలో అయినా.. ఎల్ ఈడీ బ‌ల్బ్ ను త‌గిలించిన వెంట‌నే అది వెలుగుతోంది. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. ఆ వింత‌ను చూసేందుకు గ్రామంలోని వారే కాదు.. ప‌క్క‌నున్న గ్రామాల వారు సైతం రావ‌టంతో ఇప్పుడు అత‌ని ఇల్లు సంద‌డిగా మారింది.

షేక్ చాంద్ పాషా వారం క్రితం ఎల్ ఈడీ బ‌ల్బుల్ని కొన్నాడు. అయితే.. అందులో ఒక బ‌ల్బ్ ను తాక‌గానే.. క‌రెంట్ పాస్ అయిన‌ట్లుగా వెలిగింది. ఈ వింత ఒక్క చాంద్ పాషాకు మాత్ర‌మే కాదు.. వారింట్లోని చిన్నా.. పెద్దా అందరిలోనూ ఉంది. వారు బ‌ల్బును ముట్టుకోగానే వెలుగుతోంది. ఇదే బ‌ల్బ్ ను ప‌క్కింటి వారు ప‌ట్టుకుంటే మాత్రం వెల‌గ‌టం లేదు.

దీంతో ఈ వింత విష‌యం గ్రామంలో సంచ‌ల‌నంగా మారి.. అంద‌రూ చాంద్ పాషా ఇంటికి క్యూ క‌డుతున్నారు. చాంద్ పాషా ఇంట్లో కుమారుడు స‌మీర్.. కుమార్తె సానియాలు బ‌ల్బ్ ను తాక‌గానే అది వెలుగుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమంటే.. ఇదే వింత చాంద్ పాషా భార్య‌లో మాత్రం లేదు. ఆమె బ‌ల్బ్ ప‌ట్టుకుంటే మాత్రం వెల‌గ‌లేదు. ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు.

గ‌తంలో ఇలాంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? అని గూగుల‌మ్మ‌ను శోధిస్తే.. కేర‌ళ‌కు చెందిన అబూ తాహిర్ అనే ఏడో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థికి.. వ‌రంగ‌ల్ జిల్లా న‌ల్ల‌బెల్ల మండ‌లం క‌న్న‌రావుపేట‌లో శంక‌రాచారి అనే వ్యక్తి కూడా ఎల్ ఈడీ బ‌ల్బ్ ను ట‌చ్ చేస్తే వెలుగుతాయ‌ని చెబుతున్నారు. మ‌రీ.. క‌రెంట్ మ‌నుషుల ప్ర‌త్యేక‌త ఏమిటి? వారి ట‌చ్చింగ్ తో బ‌ల్బులు ఎలా వెలుగుతున్నాయ‌న్న దానిపై నిపుణులు ఎలాంటి వాద‌న‌ను వినిపించ‌లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. అయితే.. ఇదంతా న‌మ్మేలా లేవ‌న్న మాట‌ను బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీరింగ్ ప్రొఫెష‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఇప్పుడీ కుటుంబం మాత్రం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.