Begin typing your search above and press return to search.

రసాయన కర్మాగారంలో వాయువులు లీక్.. తణుకు శివారులో హాహాకారాలు

By:  Tupaki Desk   |   5 Oct 2020 1:00 PM IST
రసాయన కర్మాగారంలో వాయువులు లీక్.. తణుకు శివారులో హాహాకారాలు
X
కొద్దినెలల క్రితం విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ నుంచి వెలువడిన విష వాయువులు కొందరి ఉసురు తీసుకోవటమే కాదు.. వందలాది మందిని ప్రభావితం చేయటంతో పాటు.. వైజాగ్ వాసులకు మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ ఉదంతంలో పదిహేను మంది మరణించటంతో పాటు.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికి ఆ విషవాయువుల కారణంగా పలువురు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

తాజాగా అలాంటి ఉదంతమే పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని పైడిపర్రు గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ఆ గ్రామానికి చెందిన పలువురు ఊపిరి ఆడక.. రోడ్ల మీదకు వచ్చి పరుగులు తీశారు. ఆదివారం అర్థరాత్రి వేళలో పైడిపర్రు గ్రామ శివారులో ఉండే ఫ్లుటస్ రసాయన కర్మాగారం నుంచి ఒక్కసారిగా ఘాటైన రసాయన వాయువులు వెలువడ్డాయి.

దీన్ని పీల్చిన పలువురు స్పృహ తప్పి పడిపోయినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ రసాయన వాయువు తీవ్రతకు పైడిపర్రుకు సమీప గ్రామాలైన వెంకట్రాయపురం గ్రామస్థులు సైతం భయాందోళనలతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాని పరిస్థితి.
రసాయన పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాయువుల్నిగుర్తించిన గ్రామస్థులు.. సదరు కర్మాగారం వద్దకు చేరుకొని.. అసలేం జరుగుతుందని ప్రశ్నించారు. అక్కడి సిబ్బందిని నిలదీయటంతో పాటు.. గాలిలో రసాయనాల శాతాన్ని పరీక్ష జరపాలని డిమాండ్ చేశారు. విశాఖలో మాదిరి చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆందోళన చేపట్టారు. తాజాగా విడుదలైన రసాయన వాయువు కారణంగా పలువురు అస్వస్థతకు గురైనట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.