Begin typing your search above and press return to search.

వలసలతో చీరాలలో చిర్రెత్తుతున్న నాయకులు!

By:  Tupaki Desk   |   21 March 2020 8:40 AM GMT
వలసలతో చీరాలలో చిర్రెత్తుతున్న నాయకులు!
X
పల్నాడు రాజకీయం మారుతోంది. ఇప్పుడు ఆ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. తాజాగా అధికార పార్టీ హవా చూపుతోంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. వలసలు భారీగా వస్తుండడంతో ఇప్పుడు అధికార పార్టీలో లీడర్లు ఎక్కువైపోయారు. దీంతో సొంత పార్టీలోనే విబేధాలు మొదలవుతున్నాయి. దీంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా సీనియర్ నాయకులు ఉన్నారు. పార్టీలో నాయకులు భారీగా పెరగడంతో కార్యకర్తలు గందరగోళం ఏర్పడింది. ఆ నాయకులు ఇప్పుడు ఐక్యత రాగం పాటించకుండా తమ ప్రాబల్యం చూపించుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ ఏర్పడుతోంది.

ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ గవర్నర్ రోశయ్య వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు నియోజకవర్గంలో తిష్టవేశారు. 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం పరాజయం పొందడంతో నియోజకవర్గంలో అతడికి పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కరణం బలరామ్‌ ఎన్నికయ్యారు. ఇప్పుడు వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు వెంకటేశ్‌ వైఎస్సార్సీలో చేరిపోయారు. గతంలో కరణం, ఆమంచి వర్గాలు తీవ్రంగా విమర్శలు చేసుకుని పోటాపోటీగా నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా పరిణామాలు మారాయి. వైఎస్సార్సీపీలోకి కరణం వర్గం రావడంతో ఆమంచి వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేగా కరణం బలరామ్ ఉండడంతో కరణం వర్గానికి ప్రాధాన్యం దక్కుతోందని వైఎస్సార్సీపీ శ్రేణులు భావిస్తున్నారు. అంతకుముందే కరణం బలరామ్ తన అనుచరులు పోతుల సునీత, పోతుల సురేశ్‌ను వైఎస్సార్సీపీలోకి పంపించి తన వర్గాన్ని పెంచుకున్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ చీరాల నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న ఆమంచి షాక్‌లో ఉన్నారు.

ఆమంచి వర్గం ఇప్పుడు ఆందోళనలో పడింది. కరణం, పోతుల సునీత, సురేశ్‌ రాకతో ఆమంచి వర్గం డీలా పడింది. బలరామ్‌ తన కుమారుడు వెంకటేశ్‌ కు తన రాజకీయ జీవితం అప్పగించనున్నారు. అందుకే వెంకటేశ్ కు మద్దతుగా ఉండేలా తన అనుచరులందరినీ వైఎస్సార్సీపీలో చేర్పించారు. వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీమంత్రి పాలేటి రామారావు కూడా వైఎస్సార్సీపీలో చేరేలా చేశారు. ప్రస్తుతం ఆమంచి ఒంటరై పోగా కరణం వర్గం బలంగా మారింది. ప్రస్తుత స్థానిక ఎన్నికల సమయంలో బలరామ్‌ అనుచర వర్గమంతా హవా సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి వర్గం.. కరణం వర్గం మధ్య సొంత పార్టీలోనే విబేధాలు తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అంతర్గత కలహాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. ఆమంచి, కరణం బలరామ్‌ వర్గంతో పార్టీ అధిష్టానం సయోధ్య కుదిరిస్తే మంచిదే. లేకపోతే అధికార పార్టీకి త్వరలోనే భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది.