Begin typing your search above and press return to search.

భారత్ లో బద్దకస్తులు.. రూ.25,600 కోట్ల భారం

By:  Tupaki Desk   |   24 Oct 2022 6:18 PM IST
భారత్ లో బద్దకస్తులు.. రూ.25,600 కోట్ల భారం
X
మనిషికి కావాల్సింది కడుపునిండా తిండి.. కంటి నిండా నిద్ర.. మధ్యలో పనిచేయడం లేదు. కానీ మొదటి రెండు చేసి మూడోదాన్ని విస్మరిస్తున్నారట మన భారతీయులు చాలా మంది. 140 కోట్ల భారతంలో బద్దకస్తులు మరీ ఎక్కువైపోయారు. సంపాదన పెరిగి..తాతలు, తండ్రులు విరివిగా సంపాదిస్తుండడంతో పనిలేక చాలా మంది బద్దకిస్తున్నారు. చాలా మంది శారీరక శ్రమ చేయడం లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థనే నివేదిక విడుదల చేసింది. ఈ బద్దకించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు పెరుగుతున్నాయట.. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు భారీగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

‘శారీరక శ్రమ లేకపోవడం వల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు, పడుతున్న భారంపై’ ఆ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారత్ గురించి అనేక అంశాలను ప్రస్తావించింది. మనదేశంలో 11-17 మధ్య వయస్సువారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదని తేలింది. బాలురు 72 శాతం, బాలికలు 76 శాతం ఉన్నారని తేలింది. 18 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 44 శాతం పురుషులు 25 శాతం వ్యాయామం చేయడం లేదు.

70 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 60 శాతం, పురుషులు 38 శాతం శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ధీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, పక్షవాతం, గుండె, క్యాన్సర్, మానసిక రుగ్మతలు తలెత్తుతున్నాయి. వీటిని నయం చేసేందుకు అయ్యే ఖర్చు దేశంలో ఏడాదికి రూ.25600 కోట్ల ఖర్చు అవుతోంది. వచ్చే పదేళ్లలో అది ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా..

ప్రస్తుతం దేశంలో ఈ బరువుతో వచ్చిన దీర్ఘకాలికవ్యాధులతో చనిపోయేవారు 66 శాతం ఉంటున్నారని సర్వే తేల్చింది. మొత్తం మరణాల్లో 30శాతం గుండెకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్త వ్యాధులు, క్యాన్సర్, షుగర్, ఇతర వ్యాధులతో చనిపోతున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ ఉండడం లేదు. జాతీయంగా శారీరక వ్యాయామం చేయించడానికి పెద్ద వాళ్ల విషయంలో ఒక సర్వేలెన్స్ వ్యవస్థ ఉంది. కానీ చిన్న పిల్లలకు లేదు. ఐదేళ్లలోపు పిల్లల విషయంలో శారీరక శ్రమ ఎంత చేయాలన్న దానిపై మార్గదర్శకాలు లేవు.

ప్రపంచంలో వచ్చే పదేళ్లలో ఇలా శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కొత్తగా 50 కోట్ల మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తేలింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 10 ఏళ్లలో నమోదయ్యే బీపీ కేసుల్లో 47 శాతం వ్యాయామం లేకపోవడం వల్లే సంభవించవచ్చు. మానసిక రుగ్మతలు నమోదయ్యే కేసుల్లో 43 శాతం మేర వ్యాయామం లేకపోవడమే కారణం. 50 కోట్ల కొత్త కేసుల్లో మూడో వంతు కేసులు దిగువ మధ్య ఆదాయ దేశాల్లోనివే కావడం గమనార్హం. మన భారత్ లాంటి దేశాల్లోనే ఇవి అత్యధికంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.