Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగులను మంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ..

By:  Tupaki Desk   |   21 Dec 2022 6:31 AM GMT
ఐటీ ఉద్యోగులను మంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ..
X
ఆర్థిక మాంద్యం ఇప్పుడు ప్రపంచాన్ని కమ్మేస్తోంది. అందరినీ రోడ్డునపడేస్తోంది. 2009లో వచ్చిన తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ ఉద్యోగులపై మాంద్యం ప్రభావం తీవ్రంగా పడింది. అమెరికాలో టాప్ టెక్నాలజీ దిగ్గజం ట్విటర్ మొదలుపెట్టిన లేఆఫ్స్ తర్వాత క్రమంగా మెటా, అమెజాన్ సహా అన్ని కంపెనీలకు పాకింది. ముఖ్యంగా అమెరికాలో కలల కొలువు చేస్తున్న వేల మంది భారతీయులు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారు. మళ్లీ 2009 నాటి పరిస్థితులే పునరావృతం కానున్నాయని తెలుస్తోంది.

ఇన్నాళ్లు సాఫ్ట్ వేర్ కొలువు అంటే ఐదురోజుల పని.. వీకెండ్ సెలవులు, లక్షల్లో జీతాలు.. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండేది. కానీ ఇప్పుడు మాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితి. ఈఎంఐలు భారీగా పెట్టుకున్న ఐటీ ఉద్యోగులకు దిక్కుతోచని పరిస్థితులున్నాయి. అందరూ తొలగిస్తుండడంతో వేరే కంపెనీలో చేరే అవకాశం లేదు. దీంతో ఖాళీగా ఉండి జాబ్ లేక నరకం చూస్తున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో మన భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపులే భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. హెచ్1బీ వీసా కలిగిన భారతీయులు ట్విటర్, మెటా, అమెజాన్ సంస్థల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. మాంద్యం కారణంగా వీరంతా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. మంచి పనితీరు కనబర్చిన వారు కూడా ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి.

ఇప్పటికే ట్విటర్ మొదలుపెట్టిన తొలగింపుల పర్వాన్ని మెటా (ఫేస్ బుక్), అమెజాన్ , గూగుల్ అందిపుచ్చుకున్నాయి. ఇక కార్పొరేట్ కంపెనీలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. లేఆఫ్స్ పేరుతో ఇంటికి పంపుతున్నాయి.

ఇవే కాదు.. చిన్న, పెద్ద, మధ్యతరహా సంస్థలు ఈ ఏడాదిలో లక్షలమంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. గతేడాది టాప్ టెక్ దిగ్గజ సంస్థలైన ట్విటర్, యాపిల్, మెటాతోపాటు ఇతర కంపెనీలు వందలమందికి లేఆఫ్స్ ఇచ్చేశాయి.

తాజాగా అమెరికాకు చెందిన ప్లేస్ మెంట్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఈ ఏడాది 965 సంస్థలు లక్షా 50వేల మందికి పింక్ స్లిప్ లు జారీ చేసినట్టు తేలింది.

ఇక వచ్చే ఏడాదిలో ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విచిత్రంగా ప్రస్తుతం తొలగింపులు 2009లో తలెత్తిన తీవ్ర ఆర్థిక మాంద్యం కంటే కూడా ఈసారి పోయిన ఉద్యోగాలు ఎక్కువేనని తెలుస్తోంది. యూఎస్ టెక్ రంగంలో ప్రస్తుతం 73000 మందికి పైగా సిబ్బందిని తొలగించగా.. భారత్ లో 17వేల మందికి పైగా ఉపాధి కోల్పోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.