Begin typing your search above and press return to search.

అమీర్ పేట నడిబజారులో పోలీసు మీద చెయ్యి వేసి మరీ వార్నింగ్

By:  Tupaki Desk   |   8 Nov 2020 7:00 PM IST
అమీర్ పేట నడిబజారులో పోలీసు మీద చెయ్యి వేసి మరీ వార్నింగ్
X
అమీర్ పేట సెంటర్.. అందునా కేఎల్ఎం షాపింగ్ మాల్. అక్కడెంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి చోట.. ఒక అమ్మాయిని ఈవ్ టీజ్ చేస్తూ.. కెలికేశాడు. దీంతో.. ఆ అమ్మాయి భయపడింది. ఇదంతా చూసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ తట్టుకోలేకపోయాడు. సదరు పోకిరిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కండల పెంచి.. వస్తాదులా ఉన్న ఈ పోకిరి.. సదరు కానిస్టేబుల్ మీద చేయి వేయటమే కాదు.. ‘నన్నే పట్టుకుంటావా? చస్తావ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

ఫోన్ చేసి.. ఎవరితో మాట్లాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఇష్టం వచ్చినట్లుగా నోటికి పని చెప్పాడు. తనను పట్టుకున్న పోలీసు మెడ పట్టుకోవటమే కాదు.. డ్రెస్ ను పట్టుకొని గుంజే ప్రయత్నం చేశాడు. తప్పించుకునేందుకు ట్రై చేశాడు. చుట్టూ చాలామంది ఉన్నా.. చూస్తూ ఉండిపోయారు. ఒకరిద్దరు మాత్రంపోలీసులకు దగ్గరగా వచ్చారు. అంతకు మించి మిగిలిన వారంతా తమ చేతిలోని ఫోన్లకు పని చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అమ్మాయిని ఈవ్ టీజ్ చేయటమే కాదు.. పోలీసు మీద చేయి వేసిన ఇతగాడి తీరును పలువురు తప్పుపడుతున్నారు. కాసేపు పెనుగులాడి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. ఆ కానిస్టేబుల్ మాత్రం పట్టువిడవకుండా జాగ్రత్త తీసుకున్నారు. అంతలో బ్యాకప్ టీంకు చెందిన పోలీసులు రంగ ప్రవేశం చేయటం.. సదరు ఆకతాయిని అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమీర్ పేట లాంటి రద్దీ ఉండే సెంటర్లోనే ఇంతలా చెలరేగిపోతే.. మిగిలిన చోట్ల సంగతేంటి?