Begin typing your search above and press return to search.

బాబుపై... లక్ష్మీపార్వ‌తిదీ జ‌గ‌న్ మాటే!

By:  Tupaki Desk   |   4 Aug 2017 6:11 PM GMT
బాబుపై... లక్ష్మీపార్వ‌తిదీ జ‌గ‌న్ మాటే!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను పుర‌స్క‌రించుకుని నిన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నంద్యాల బ‌హిరంగ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు టీడీపీ నేత‌లు పెద్ద రాద్దాంత‌మే చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. చంద్ర‌బాబు స‌ర్కారుపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్‌... ప్ర‌జా కంట‌క పాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చి చంపినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా... చంద్ర‌బాబు స‌ర్కారు సాగిస్తున్న పాల‌న‌పైనా ఆయ‌న త‌న‌దైన శైలిలో ఓ విప‌క్ష నేత ఎలా మాట్లాడతారో, అదే స్థాయిలో మాట్లాడార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అంతేకాకుండా... త‌న స‌భ‌పై టీడీపీ నోట మాట రాకుండా చేసేలా... త‌న పార్టీలో చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి చేత ప్ర‌జ‌ల స‌మక్షంలోనే, స‌భా వేదిక మీదే రాజీనామా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయించారు. జ‌గ‌న్ కొట్టిన ఈ దెబ్బ‌కు దిమ్మ‌తిరిగిపోయిన టీడీపీ... ఆ విష‌యాన్ని ప‌క్క‌న ప‌డేసి... చంద్ర‌బాబుపై జ‌గ‌న్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ నిన్న‌టి నుంచే ఆందోళ‌న‌ల‌కు తెర తీసింద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. అంతేకాకుండా టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వైనం మ‌నం చూస్తున్న‌దే. ఈ క్ర‌మంలో టీడీపీ వ్య‌వస్థాప‌కుడు, దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణిగా ల‌క్ష్మీపార్వ‌తి కూడా మీడియా ముందుకు వ‌చ్చారు. అస‌లు వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పేమీ లేద‌ని ఆమె కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో ఒక్క అక్ష‌రం కూడా త‌ప్పు లేద‌ని కూడా ఆమె తేల్చిపారేశారు.

అయినా ల‌క్ష్మీపార్వ‌తి ఏమ‌న్నారంటే... *నంద్యాల సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడిన దాంట్లో తప్పేంలేదు. జగన్‌లో ఎన్టీఆర్‌ ప్రవేశించి ఆ మాట చెప్పించి ఉంటారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తండ్రిలాంటి మామను చంపిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నో హత్యల్లో చంద్రబాబుకు పరోక్ష ప్రమేయం ఉంది. హత్యా రాజకీయాలపై టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి* అని ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు. అంతేకాకుండా నంద్యాల ప్రజల ఆవేదననే జగన్‌ చెప్పారని కూడా ఆమె అన్నారు. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు చంద్రబాబు 12 హామీలిచ్చి ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటలే జగన్‌ను కదిలించాయని, చంద్రబాబును ఏం చేసినా తప్పులేదని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. వెర‌సి నంద్యాల వేదిక‌గా జ‌గ‌న్ చెప్పిన మాట‌ను హైద‌రాబాదులో ల‌క్ష్మీపార్వ‌తి ప‌లికేసిన‌ట్టైంది.