Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఎమ్మెల్సీని లంచం డిమాండ్‌..వైద్యుడిపై వేటు

By:  Tupaki Desk   |   15 March 2018 6:45 AM GMT
టీఆర్ ఎస్ ఎమ్మెల్సీని లంచం డిమాండ్‌..వైద్యుడిపై వేటు
X
తెలంగాణ‌లో అవినీతి ఏమాత్రం జ‌ర‌గ‌డం లేద‌ని ఓ వైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టిస్తుంటే..మ‌రోవైపు విచ్చ‌ల‌విడిగా అవినీతి జ‌రుగుతున్న ఉదంతం తెర‌మీద‌కు వ‌చ్చింది. అధికార టీఆర్‌ ఎస్ పార్టీ ఎమ్మెల్సీనే డ‌బ్బులు లంచంగా అడిగాడు ఓ వైద్యుడు. అది కూడా ఎందుకంటే...శ‌వానికి పోస్టుమార్టం చేసేందుకు. అలాంటి షాక్‌ ను ఎదుర్కుంది ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ. అయితే ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య తీసుకుంది. ఆయ‌న‌పై వేటు వేసింది.

వరంగల్ ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యుడు డబ్బులు డిమాండ్ చేయడాన్ని శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బాలసాని లక్ష్మీనారాయణ సభ దృష్టికి తీసుకొచ్చారు. 'మా బంధువు చనిపోతే వరంగల్‌ లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. నేను వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఎమ్మెల్సీ అని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది లంచమడిగారు. ఆస్పత్రి అధికారులు నన్ను నాలుగు గంటలు ఆగమన్నారు. ఆ తర్వాత కాకతీయ మెడికల్‌ కాలేజీ నుంచి డాక్టర్లు వచ్చారు. రూ.3 వేలు లంచం తీసుకొని పోస్టుమార్టం చేశారు. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదే?. చనిపోయిన బాధలో మేముంటే - లంచం ఇస్తేనే పోస్టుమార్టం చేస్తామనడం ఎంత వరకు సమంజసం. ప్రజా ప్రతినిధుల వద్దే లంచం తీసుకుంటే - సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి లేని పాలన సాగుతోందని చెప్తున్నారు. కిందిస్థాయిలో సిబ్బంది మాత్రం యధేచ్చగా లంచం తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది` అంటూ వాస్త‌వ ప‌రిస్థితులు వెల్ల‌డించారు.

అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి లక్ష్మారెడ్డి సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎంఈని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి రజామల్లిక్‌ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ నిర్ణ‌యాన్ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్న‌ప్ప‌టికీ...కొంద‌రు వైద్యుల తీరు తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.