Begin typing your search above and press return to search.

షాకిచ్చిన న్యాయవాది.. నగ్నంగా కోర్టు ఎదుట నిరసన.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   31 July 2020 10:15 AM IST
షాకిచ్చిన న్యాయవాది.. నగ్నంగా కోర్టు ఎదుట నిరసన.. ఎందుకంటే?
X
కరోనా పుణ్యమా అని పరిస్థితులు ఎంతలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. సమీప భవిష్యత్తులో పరిస్థితి చక్కబడే అవకాశం లేని పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. ఇప్పటికే కరోనా కారణంగా చాలా షాపులు మూతపడటం.. ఆన్ లాక్ లో భాగంగా షాపులు ఓపెన్ అవుతున్నా.. వ్యాపారాలు లేని పరిస్థితి. చివరకు అద్దెలు.. ఉద్యోగుల జీతాలు కూడా ఆదాయం రూపంలో రాని నేపథ్యంలో.. ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు.

వ్యాపారాలే కాదు.. చాలా ప్రొఫెషన్స్ కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇందుకు న్యాయవాదులు సైతం మినహాయింపు కాదు. కరోనా నేపథ్యంలో అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారిస్తున్నారు. దీంతో.. పలు కేసులు విచారణకు రాని పరిస్థితి నెలకొంది. కేసులు విచారణకు రాని వేళ.. లాయర్లకు జీవనోపాధికి సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు లాయర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

తాజాగా తమిళనాడులోని విరుదునగర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మణికంఠన్ అనే న్యాయవాది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ తో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోవటం.. దీంతో ఎలాంటి పని లేక ఆర్థిక ఇబ్బందులు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటివేళ.. వేరే పని చేద్దామని ప్రయత్నించారు. కానీ.. సాధ్యం కాలేదు. దీంతో అతగాడు.. కోర్టు ఎదుటే నగ్నంగా కూర్చొని నిరసన చేపట్టారు.ఆర్థిక సమస్యల పరిష్కారానికి దారి చూపించాల్సిందిగా కోరుతున్నాడు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. కోర్టు ఎదుట లాయరే స్వయంగా నిరసన చేయటంతో ఉలిక్కిపడిన పోలీసు అధికారులు హుటాహుటిన ఆయన వద్దకు వెళ్లి సర్ది చెప్పారు. ఆయన చేత నిరసనను విరమింపచేశారు. తన ఒక్కడి పరిస్థితే కాదని.. చాలామంది న్యాయవాదుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని.. ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరుతున్నారు.