Begin typing your search above and press return to search.

జ‌మిలిలో కొత్త కోణాల్ని చెప్పిన పార్టీలు

By:  Tupaki Desk   |   8 July 2018 4:54 AM GMT
జ‌మిలిలో కొత్త కోణాల్ని చెప్పిన పార్టీలు
X
కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసిన జ‌మిలి ఎన్నిక‌ల విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. లోక్ స‌భ‌తో పాటు.. రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించే ఈ విధానంపై మూడు రోజుల పాటు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌తో లా క‌మిష‌న్ సంప్ర‌దింపులు మొద‌లు పెట్టింది.

మొద‌టిరోజున‌.. ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలైన కాంగ్రెస్‌.. బీజేపీలు ఈ స‌మావేశానికి హాజ‌రు కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. ఈ స‌మావేశానికి హాజ‌రైన మోడీ స‌ర్కారుకు మిత్రుడైన గోవా ఫార్వ‌ర్డ్ పార్టీ సైతం జ‌మిలిని వ్య‌తిరేకించారు. భేటీకి హాజ‌రైన ప‌లు ప్రాంతీయ‌ పార్టీలు జ‌మిలిని వ్య‌తిరేకించాయి. ఇక‌.. సీపీఎం అయితే.. ఈ స‌మావేశానికి హాజ‌రు కావ‌ట‌మే దండుగ అని తేల్చేసింది.

మ‌రో రెండు రోజుల పాటు సాగ‌నున్న ఈ భేటీల‌పై తృణ‌మూల్ కాంగ్రెస్.. సీపీఐ.. గోవా ఫార్వ‌ర్డ్ పార్టీల‌తో స‌హా మ‌రికొన్నిపార్టీలు పాల్గొన్నాయి. అన్నీ.. జ‌మిలిని వ్య‌తిరేకించినోళ్లే. ఈ ప్ర‌తిపాద‌న స‌మాఖ్య స్ఫూర్తికి.. ప్రాంతీయ భావోద్వేగాల‌కు వ్య‌తిరేకంగా తేల్చారు. ఈ కార‌ణంతోనే తాము జ‌మిలిని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు గోవా మంత్రి విజ‌య్ వెల్ల‌డించారు.

జ‌మిలిని అమ‌లు చేస్తే ప్రాంతీయ స‌మ‌స్య‌లు ప‌క్క‌కు వెళ్లిపోతాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. జ‌మిలి ఎన్నిక‌లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని.. వ‌ద్దంటే వ‌ద్దంటూ తృణ‌మూల్ కాంగ్రెస్ నేత స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగ మూలాన్ని మార్చ‌కూడ‌దంటూ ఆయ‌న త‌న వాద‌న‌ను స్ప‌ష్టంగా వినిపించారు.

ఒక ఉదాహ‌ర‌ణ‌ను ప్ర‌స్తావించిన విజ‌య్‌..ఒక‌వేళ 2019లో లోక్ స‌భ‌తో పాటు.. అన్ని రాష్ట్రాలకు ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించార‌ని అనుకుంటే.. కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకుండా సంకీర్ణం ఏర్ప‌డిన త‌ర్వాత ఏదైనా రాజ‌కీయ పార్టీ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంటే ప‌రిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

అప్పుడు మ‌ళ్లీ దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తారా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. జ‌మిలితో రాష్ట్రాల‌ స‌మ‌స్య‌లు ప‌క్క‌కు వెళ్లిపోతాయ‌న్నారు. రాజ్యాంగాన్ని.. ప్ర‌జాస్వామ్యాన్ని తొక్కిపెడుతుంద‌న్న అభిప్రాయంతో పాటు.. భావోద్వేగాల్ని సైతం ప్ర‌భావితం చేస్తుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లు పార్టీలు వ్య‌క్తం చేశాయి. అస‌లు జ‌మిలి ఎన్నిక‌ల అంశం లా క‌మిష‌న్ అధికార ప‌రిధిలోకి రాద‌ని.. ఇది పార్ల‌మెంటు ప‌రిధిలోనిదంటూ సీపీఐ కార్య‌ద‌ర్శి అతుల్ రంజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మ పార్టీ జ‌మిలి విధానాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంద‌న్నారు. ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌లు జ‌ర‌గాలే కానీ.. జ‌మిలి జ‌ర‌గ‌కూడ‌ద‌న్నారు.

అంబేడ్క‌ర్ తో స‌హా రాజ్యాంగాన్ని త‌యారు చేసిన వారంతా పండితుల‌ని.. వారితో పోలిస్తే ఇప్ప‌టివారికి ఏమీ తెలీద‌న్న తృణ‌మూల్ నేత క‌ల్యాణ్ బెన‌ర్జీ.. వారెప్పుడూ జ‌మిలిపై చ‌ర్చించ‌లేదు.. మ‌న‌కు స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌ను అందించారు.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం సుపీరియ‌ర్ కానే కాద‌న్నారు. జ‌మిలిపై ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన చ‌ర్చ‌కు చెక్ పెట్టేలా రాజ‌కీయ పార్టీలు ప్రాథ‌మికంగానే ఈ విధానాన్ని త‌ప్పు ప‌ట్ట‌టం చూస్తే.. జ‌మిలికి నీళ్లు వ‌దిలేసిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.