Begin typing your search above and press return to search.

మూడో వేవ్ వేళ ఐసీఎంఆర్ చేసిన తాజా హెచ్చరికలివే!

By:  Tupaki Desk   |   20 Jan 2022 3:43 AM GMT
మూడో వేవ్ వేళ ఐసీఎంఆర్ చేసిన తాజా హెచ్చరికలివే!
X
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కొవిడ్ మూడో వేవ్.. మన దేశంలోకి అడుగు పెట్టి దాదాపుగా పది రోజులకు పైనే అయ్యింది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటం తెలిసిందే. రెండో దశతో పోలిస్తే.. మూడో దశలో కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అనారోగ్య తీవ్రత తక్కువగా ఉండటంతో కొంతలో కొంత ఉపశమనంగా మారింది. రెండో వేవ్ వేళ.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపటం.. ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవల కోసం పరుగులు తీయాల్సిన అవసరం చాలాతక్కువ మందిలోనే కనిపిస్తోంది.

అయితే.. తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారంతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. తమలోని తీవ్రతను తక్కువగా చూసుకోవటం ద్వారా.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లక్షణాల తీవ్రతను ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆసుపత్రుల్లో చేరాలి? ఎవరు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? లాంటి ప్రశ్నలను సంధిస్తూ.. వాటికి సవివరమైన సూచనల్ని చేస్తోది ఐసీఎంఆర్ - ఢిల్లీ ఎయిమ్స్ సంస్థలు.

ఈ రెండు సంస్థలు మూడో వేవ్ నను మూడు దశలుగా పేర్కొంటోంది.

1. స్వల్ప లక్షణాలతో వైరస్ అటాక్ చేయటం
2. మధ్యస్థ లక్షణాలు
3. తీవ్ర వ్యాధిగా గుర్తించేలా లక్షణాలు.

ఇందులో మొదటగా స్వల్ప లక్షణాల్ని చూస్తే..

- జలుబు
- దగ్గు
- జ్వరం
- గొంతు నొప్పి

ఈ తరహాలో రోగ లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

- భౌతిక దూరం
- ఐసోలేషన్
- ఇంట్లోనూ మాస్కుల్ని ధరించటం
- నీళ్లు తగినంతగా తాగటం (గోరు వెచ్చని నీళ్లు)
- రోజుకు మూడు సార్లు టెంపరేచర్.. ఆక్సిజన్ స్థాయిల్ని పరీక్షించుకోవటం

ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయా? అంటే ఉంటాయంటున్నారు. దాన్నెలా గుర్తించాలన్న విషయానికి వెళితే..

- శ్వాస పీల్చుకోవటం కష్టంగా మారినప్పుడు
- ఆక్సిజన్ స్థాయిలు 99 కంటే తక్కువైనప్పుడు
- జ్వరం.. దగ్గు తీవ్రమైనప్పుడు
- 5 రోజులైనా లక్షనాలు తగ్గకపోతే
- దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు 3 రోజుల కంటే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు

స్వల్ప లక్షణాలు కూడా కొందరికి తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంటాయి. అలా అయినప్పుడు కొందరికి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలా ఉన్న వారు ఎవరు? అన్న సందేహానికి సమాధానం ఇస్తున్నారు. ముప్పు ఎక్కువ ఎవరికంటే..

- 60 ఏళ్లు దాటిన వారు
- షుగర్ పేషెంట్లు
- ఊబకాయులు
- గుండె రక్తనాళాల జబ్బు
- బీపీ ఎక్కువగా ఉండేవారు
- హెచ్ఐవీ.. క్షయ
- ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారు
- కిడ్నీ సమస్యలు ఉన్న వారు
- ఇప్పటికే లివర్ ఇష్యూస్ ఉన్నవారు
- మెదడు.. రక్తనాళాల జబ్బులతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారు

మధ్యస్థ లక్షణాలతో ఉండటం అంటే ఏమిటి?అలాంటి వారికి ఉండే లక్షణాలు ఏమిటి? వారికి ఎలాంటి చికిత్స అవసరం ఉన్న విషయంలోకి వెళితే..
మథ్యస్థ లక్షణాలు ఏమంటే..

- నిమిషానికి 24 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవాల్సి రావటం
- ఆయాసం
- రక్తంలో ఆక్సిజన్ 90-93 శాతం మధ్యలో ఉండటం

ఇలాంటి వారికి అందించాల్సిన చికిత్స ఏమంటే.. ముందుగా వారిని వైద్యుడికి చూపించటం అవసరం. వారి సలహాలు సైచనలు మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఆసుపత్రిలో చికిత్స అవసరం. రక్తంలో ఆక్సిజన్ శాతం 92-96 మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం.. వైద్యుల సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్ చికిత్సను ఆసుపత్రిలో ప్రారంభించి.. అక్కడే ముగించాలి. ఇంటికి వెళ్లాక స్టెరాయిడ్ వాడే విధానాన్ని ఫాలో కాకూడదు. అవసరానికి మిమచిన స్టెరాయిడ్ లను వాడితే మ్యూకర్ మైకోసిస్ తదితర జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది.

మరి.. వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

- శ్వాస తీరు ఎలా ఉందో చూసుకోవటం
- ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుంటే.. ఛాతీ.. ఎక్స్ రే.. సిటీ స్కాన్ లాంటి పరీక్షలు చేయించుకోవటం
- రెండు మూడు రోజులకోసారి సీఆర్ పీ.. డీ డైమర్.. షుగర్.. సీబీసీ.. కిడ్నీ.. లివర్ ఫంక్షనింగ్ పరీక్షలు చేయించుకోవాలి

తీవ్ర వ్యాధి లక్షణాలు అంటే ఏమిటి? దానికి చికిత్స ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే.. ఇందులో ప్రధానంగా..

నిమిషానికి 30 సార్ల కంటే అధికంగా శ్వాస తీసుకోవాల్సి రావటం.. తీవ్ర ఆయాసం.. రక్తంలో ఆక్సిజన్ శాతం 90 కంటే తగ్గిపోవటంగా చూడాలి. ఇలాంటివారిని వెంటనే ఐసీపీలో చేర్పించి చికిత్స అవసరం. వైద్యుల సూచనలకు తగినట్లుగా స్పందించాల్సి ఉంటుంది. వారు కనుక స్టెరాయిడ్ లను వాడమంటే వాడాలి. యాంటీ ఇన్ ఫ్లమేటరీ చికిత్సను అందించాలి. అయితే.. నిర్దారణ పరీక్షలు తరచూ చేయనక్కర్లేదు. రెండు మూడు రోజులకోసారి సీఆర్ పీ.. డీ డైమర్.. షుగర్.. సీబీసీ.. కిడ్నీ.. లివర్ ఫంక్షనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గు రెండు మూడు వారాల కంటే ఎక్కువగా వేధిస్తుంటే.. క్షయ ఇతర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించటంచాలా ముఖ్యం.