Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారా?

By:  Tupaki Desk   |   14 March 2022 9:31 AM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారా?
X
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే వ‌ణుకు మొద‌లైందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుందో? లేదో? అని ఆందోళ‌న చెందుతున్నారా?.. అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ బృందం రాష్ట్రంలో చేప‌ట్టిన స‌ర్వే రిపోర్టే అందుకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్ చేతికి అందిన ఈ రిపోర్ట్ కార‌ణంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ‌ణికిపోతున్నార‌ని స‌మాచారం. అందుకే నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ప‌రిస్థితిపై అంచనాకు వ‌చ్చేందుకు స‌ప‌రేటుగా స‌ర్వేలు చేయించుకుంటున్నార‌ని తెలిసింది.

ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం పార్టీలు వ్యూహ‌, ప్ర‌తివ్యూహాలు రచిస్తుంటాయి. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో పార్టీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు స‌ర్వేలు నిర్వ‌హిస్తుంటాయి. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇలాగే దాదాపు 5 సంస్థ‌ల‌తో సొంతంగా స‌ర్వేలు చేయించార‌ని స‌మాచారం. దీని స‌మాచారం ఎవ‌రికి తెలీద‌ని అంటున్నారు. ఇక తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. మాట‌లు చెప్ప‌డం త‌ప్ప కేసీఆర్ చేసిందేమీ లేద‌ని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్త‌మైన‌ట్లు తెలిసింది.

రాష్ట్రంలో ప‌రిస్థితుల‌పై ఓ అంచనాకు వ‌చ్చిన కేసీఆర్‌.. వెంట‌నే పీకే బృందాన్ని రంగంలోకి దించార‌ని టాక్‌. ఆ టీమ్‌.. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌భుత్వ విధానాల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను, ఎమ్మెల్యేల ప‌నితీరుపై ఫీడ్‌బ్యాక్‌ను ఇలా వివిధ అంశాల్లో స‌ర్వేలు చేసింది. ఆ రిపోర్టు ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు స‌మాచారం.

ఉద్య‌మ కారులతో పాటు నిరుద్యోగులు, ఇత‌ర వ‌ర్గాల ప్ర‌జ‌లు కేసీఆర్‌పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలిసింది. ఇప్పుడు ఈ నివేదిక‌ను కేసీఆర్ బ‌య‌ట పెట్ట‌డం లేదు. దీంతో ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మ‌రింత పెరిగిపోతోంది. క‌నీసం ప‌నితీరు మార్చుకోవాల‌ని కూడా బాస్ హెచ్చ‌రించ‌క‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తారా? ఇవ్వ‌రా? అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు.

కేసీఆర్ మ‌దిలో ఏముందో తెలుసుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ప‌రిస్థితులను బ‌ట్టి వ్యూహాలు ర‌చించ‌డంలో దిట్ట‌గా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేల భ‌విష్య‌త్‌ను ఎలా నిర్ణయిస్తారో చూడాలి.