Begin typing your search above and press return to search.

షేన్ వార్న్ ను బతికించటానికి ఫ్రెండ్స్ అంతలా కష్టపడ్డారట

By:  Tupaki Desk   |   5 March 2022 9:31 AM GMT
షేన్ వార్న్ ను బతికించటానికి ఫ్రెండ్స్ అంతలా కష్టపడ్డారట
X
ఆట వేరు.. వ్యక్తిగతం వేరు. కానీ.. వ్యక్తిగతంగా క్రమబద్ధ జీవితాన్ని గడిపే వారికి లభించే గుర్తింపు ఆదరణ వేరుగా ఉంటుంది. హఠ్మానర్మణంతో అందరిని షాకిచ్చిన ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ జీవితం చాలామంది క్రికెటర్లకు కాస్త భిన్నమైనది.

ఆయన తన జీవితంలో షోకిల్లాలా గడిపాడు. ఆయనకున్న ఎఫైర్లతో తరచూ వార్తల్లో దర్శనమిచ్చేవాడు. ఫ్రీ లైఫ్ ను ఇష్టపడే అతగాడు.. గ్రౌండ్ లో ఎన్ని అద్భుతాలు చేసేవాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.

గడిచిన కొద్ది రోజులుగా థాయ్ లాండ్ లోని ఒక ప్రైవేటు విల్లాలో బస చేసి ఉండటం తెలిసిందే. థాయ్ లాండ్ లోని కోహ్ సామూయ్ లో స్నేహితులతో కలిసి బస చేసిన ఆయన.. గుండెపోటుతో హటాత్తుగా అకాల మరణం చెందటం అందరిని షాక్ కు గురి చేసింది. తొలుత అతడి మరణ వార్తను ఫేక్ న్యూస్ గా ఫీల్ అయిన వాళ్లెందరో. అయితే.. అతడు మరణించిన వైనం అధికారికంగా వెల్లడించిన తర్వాత కూడా చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి.

ఇక.. షేన్ వార్న్ చివరి క్షణాల్లో ఆయన్ను బతికించేందుకు అతడి స్నేహితుల్లో ఒకరు పెద్ద ఎత్తున ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా థాయ్ లాండ్ పోలీసులు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. భోజనానికి రావాల్సిన షేన్ వార్న్.. సమయానికి రాకపోవటం.. గదిలోనే ఉండిపోవటంతో అతడి స్నేహితుల్లో ఒకరు అతడి గదికి వెళ్లారు.

అప్పటికే షేన్ వార్న్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన అతడి మిత్రుడు.. వెంటనే గుండెపోటుకు గురై ఉంటారని భావించి.. అతని ఛాతీ భాగంలో సుమారు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ.. అతని ప్రయత్నం ఫలించలేదు.

ఓవైపు సీపీఆర్ చేస్తూనే మరోవైపు అంబులెన్సును పిలిపించటం.. అంబులెన్సులో వచ్చిన వైద్యులు సైతం ఆసుపత్రిలో సీపీఆర్ చేసి ఆయన్ను బతికించేందుకు కష్టపడ్డారు. అయినప్పటికి షేన్ వార్న్ ప్రాణాల్ని మాత్రం నిలబెట్టలేకపోయినట్లు చెబుతున్నారు. ఏమైనా షేన్ వార్న్ మరణం.. క్రీడాభిమానులకు షాకింగ్ గా మారింది.