Begin typing your search above and press return to search.

ప్రజారాజ్యం బ్యాచ్ టోటల్ గా షిఫ్ట్... ?

By:  Tupaki Desk   |   5 March 2022 12:06 PM GMT
ప్రజారాజ్యం బ్యాచ్ టోటల్ గా షిఫ్ట్... ?
X
ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసినపుడు ఏపీ రాజకీయాల్లో వచ్చిన ఊపు ఒక లెవెల్ లో ఉంది. నిజానికి చిరంజీవి సీఎం అని అంతా అనుకున్నారు. ఆరంభంలో ఉన్న టెంపో చివరి దాకా కంటిన్యూ అయినట్లు అయితే మెగాస్టార్ కచ్చితంగా ఏపీకి సీఎం అయ్యేవారు. అయితే ఆ తరువాత అనేక పరిణామాలు జరిగాయి. ఇక రెండు పెద్ద పార్టీల మధ్యన పడి ప్రజారాజ్యం నలిగింది. రాంగ్ టైమ్ లో పార్టీ రావడం కూడా దెబ్బేసింది అన్న విశ్లేషణ ఉంది. మొత్తానికి ప్రజారాజ్యం ఒక ముగిసిన చరిత్ర.

సరే ఆ పార్టీ అయితే ఇపుడు లేదు కానీ అందులో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నవారూ చాలా మందే ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వాన ఉంది. అన్న నాడు పార్టీని పెట్టి మూడేళ్లలో కాంగ్రెస్ లో కలిపేశారు అని విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తమ్ముడు పవన్ మాత్రం ఎనిమిదేళ్ళుగా పడుతూ లేస్తూ పార్టీ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నపుడు మాజీ ప్రజారాజ్యం బ్యాచ్ చూపులు జనసేన వైపు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

ఏపీలో 2024 ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు, జగన్ ఈ ఇద్దరి పాలనను జనాలు చూసేశారు. మూడవ పార్టీగా ఎవరైనా వచ్చి గట్టిగా పట్టుపడితే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. మరో వైపు చూస్తే పొత్తులతో అయినా ఈసారి జనసేన జెండా ఎగరాల్సిందే అన్న చర్చ కూడా ఉంది. దాంతో జనసేనను బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా గట్టిగానే సాగుతున్నాయని టాక్ నడుస్తోంది.

ఇక 2019 ఎన్నికల వేళ వైసీపీ వేవ్ లో జనసేనను పట్టించుకోని వారు ఈసారి మాత్రం ఆశగా చూస్తున్నారు. జనసేనలోకి జంప్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. అలాంటి వారంతా గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో ఎక్కువగా ఉన్నారు. దాంతో వీరంతా షిఫ్ట్ అయితే కచ్చితంగా ఈ అయిదు జిల్లాల్లో స్ట్రాంగ్ గా జనసేన తయారు అవుతుంది అని కూడా అంచనా వేస్తున్నారు.

ఇక ప్రజారాజ్యంలో నాడు చురుకుగా ఉన్న వారు చూస్తే శ్రీకాకుళం నుంచి కళా వెంకటరావు, తమ్మినేని సీతారాం, విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, విశాఖలో మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, ఎస్ ఎ రహమాన్, పల్లా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు.

గోదావరి జిల్లాలో చూసుకుంటే జ్యోతుల నెహ్రూ, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారున్నారు, అలాగే టీడీపీలో ఉన్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వంటి వారు కూడా ప్రజారాజ్యం పార్టీ నేతలే. వీరితో పాటు డజన్ల కొద్దీ ఇతర సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మరి వారందరినీ సంఘటపరచే ప్రయత్నాలు అయితే చురుకుగా సాగుతున్నాయట.

వీరిలో మాజీ మంత్రులుగా ఉన్న వారు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ప్రస్తుతం ఉన్న పార్టీలలో అవకాశాలు దక్కనివారు అయితే కచ్చితంగా జనసేనలోకి దూకేస్తారు అంటున్నారు. ఇలా వీరందరినీ ఈ అయిదు జిల్లాల్లో జనసేన వైపు మళ్ళించడానికి ఒక మాజీ మంత్రి తెర వెనక చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో టీడీపీకి వైసీపీకి పెను సవాల్ చేసే స్థాయిలో జనసేన కూడా తయారు కావడం తధ్యమని అంటున్నారు.