Begin typing your search above and press return to search.

ప్రమాణస్వీకారం చేశారో లేదో వివాదంలో చిక్కుకున్నాడే

By:  Tupaki Desk   |   18 March 2022 10:20 AM IST
ప్రమాణస్వీకారం చేశారో లేదో వివాదంలో చిక్కుకున్నాడే
X
ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందరి అంచనాలకు భిన్నంగా భారీ సంఖ్యలో సీట్లను సొంతం చేసుకోవటం ద్వారా పంజాబ్ రాజ్య పీఠాన్ని చీపురు పార్టీ సొంతం చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగానే ఆమ్ ఆద్మీ నేత భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటం.. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే అనూహ్యంగా ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటివరకు పంజాబ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ ఒక్క నేత చేయని విధంగా.. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన ఖట్కర్ కలాన్ గ్రామంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు తాజా వివాదానికి కారణంగా మారాయి. ఇంతకూ కారణం ఏమంటే.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ముందు.. ఆయన సంతకం చేస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. సీఎం ఆఫీసులో ఉండాల్సిన షేర్ ఏ పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ ఫోటో అక్కడ లేకపోవటం తాజా వివాదానికి కారణం.

ఆయన ఫోటో స్థానంలో భగత్ సింగ్ ఫోటోతో పాటు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫోటోలు ఉంచటంపై ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. రంజిత్ సింగ్ ఫోటో మిస్ కావటంపై పంజాబీలు గరం గరంగా ఉన్నారు.

రాజా రంజిత్ సింగ్ ఫోటో మిస్ కావటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి తక్షణం క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటివరకు సీఎంలుగా పని చేసిన వారెవరూ కూడా రంజిత్ సింగ్ ఫోటోను టచ్ చేసే సాహసం చేయలేదు.

అందుకు భిన్నంగా సీఎం ఆఫీసులోకి భగవంత్ ఎంట్రీతోనే వివాదాన్ని ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తప్పుల్ని ఒప్పుకొని.. వివాదాన్ని సమసిపోయేలా చేస్తారా? లేదంటే.. మరింత రాజుకునేలా చేస్తారో చూడాలి.