Begin typing your search above and press return to search.

సింగరేణి కుంభకోణంపై మోడీకి కోమటిరెడ్డి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   15 March 2022 6:18 AM IST
సింగరేణి కుంభకోణంపై మోడీకి కోమటిరెడ్డి ఫిర్యాదు
X
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన అడుగులు వేశారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటి అయ్యారు. సోమవారం సాయంత్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన ప్రధానిని కలిశారు. కొన్ని డిమాండ్లు, మరికొన్ని ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించిన అరగంటలోనే మోడీ అపాయింట్ మెంట్ లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2023లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ఈ క్రమంలోనే ఇక్కడ జెండా పాతాలని బీజేపీ ఎదురుచూస్తోంది. తెలంగాణ రాజకీయాల గురించి.. టీఆర్ఎస్ పరిపాలన గురించి ఆరాతీయడానికి ప్రధాని ఎంత ఆసక్తిగా ఉన్నారనేది దీంతో స్పష్టమవుతోంది.

నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించడం.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించడం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో కోమటిరెడ్డి ప్రధాని మోడీని కలవడం ఆసక్తి రేపుతోంది.

ఇక మోడీని కలవడానికి గల కారణాలను కోమటిరెడ్డి మీడియాకు వివరించారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని.. వాటిని పరిష్కరించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించారు. మూసిని ప్రక్షాళన చేయాలని.. కాలుష్య కాసారంలో ఉన్న నీటిని శుద్ధి చేయకుండా దిగువకు విడుదల చేయడం వల్ల ఉమ్మడి నల్లగొండ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోమటిరెడ్డి తెలిపారు. దీనికోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల రహదారి విస్తరణ చేయాలని మోడీని కోమటిరెడ్డి కోరారు. ఇక దక్షణాదిలోనే అతిపెద్ద బొగ్గు గని సింగరేణి క్యాలరీస్ లో 50 వేల కోట్ల రూపాయాల మేర కుంభకోణం చోటుచేసుకునే అవకాశం ఉందని కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ మైనింగ్ టెండర్లను తన కుటుంబ సభ్యులకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు.