Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఇక చుక్కలే.. విరోధి పాక్ ఆర్మీ చీఫ్.. పుల్వామా టైంలో ఐఎస్ఐ చీఫ్

By:  Tupaki Desk   |   25 Nov 2022 3:32 AM GMT
ఇమ్రాన్ ఇక చుక్కలే.. విరోధి పాక్ ఆర్మీ చీఫ్.. పుల్వామా టైంలో ఐఎస్ఐ చీఫ్
X
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కఠిన కాలం ఎదురవబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో పదవీచ్యుతుడైన ఆయనపై గత నెల హత్యా యత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాలి లోకి తూటా దూసుకెళ్లడంతో ఇమ్రాన్ ఆస్పత్రిపాలయ్యారు. ప్రధాని షాబాజ్ అహ్మద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన లాంగ్ మార్చ్ లో ఇమ్రాన్ పై కాల్పులు జరిగాయి.

సరిగ్గా 15 ఏళ్ల కిందట మాజీ ప్రధాని బేనజీర్ భుట్ట్లో పై ఇదే తరహాలో హత్యా ప్రయత్నం జరిగింది. ఆమె దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఇమ్రాన్ పై కాల్పుల ఉదంతం నాటి ఘటనను గుర్తుచేసింది. కాగా, పాకిస్థాన్ లో పౌర ప్రభుత్వం కంటే సైన్యం శక్తిమంతమైనది. 2019లో ఇమ్రాన్ సైన్యం మద్దతుతోనే ప్రధాని అయ్యారు. మనందరికీ తెలిసిన 1999 కుట్రలో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ సర్కారును కూలదోసి.. ముషారఫ్ పాక్ పీఠంపై కూర్చున్నారు.

కొత్త చీఫ్ తో ముళ్ల కుంపటే..

ఇప్పుడు పాకిస్థాన్ కు కొత్త ఆర్మీ చీఫ్ వచ్చారు. ఆయన పేరు అసీమ్‌ మునీర్‌..! ఇమ్రాన్‌ ఖాన్ కు విరోధి. అయితే, ఈ మునీర్ పుల్వామా ఆత్మాహుతి దాడి సమయంలో పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ చీఫ్‌ కావడం గమనార్హం. ఇది భారత్ కు కొంత గమనించదగ్గ అంశం. దీంతో మన దేశం ఈ పరిణామాలనుజాగ్రత్తగా గమనిస్తోంది. మునీర్ నియామకంతో పాక్‌ సైన్యం ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. లెఫ్టినెంట్‌ జనరళ్లు షహిర్‌ షంషాద్‌ మిర్జా, అజర్‌ అబ్బాస్‌, నుమాన్‌ మహమ్మద్‌, ఫయాజ్‌ హమీద్‌ పోటీపడగా.. వారందరినీ నెట్టుకుని అసీమ్‌ మునీర్‌ ఎంపికయ్యారు.

ఇమ్రాన్ కోపానికి గురై..

కారణాలు ఏమైనా.. మునీర్ అంటే ఇమ్రాన్ కు పడదు. ఆయనపై గతంలో కోప్పడ్డారు కూడా. ఇమ్రాన్ సతీమణిపై వచ్చిన ఆరోపణల గురించి ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న మునీర్ మాట్లాడడంతో ఆయనను బదలీ చేశారు. అంతకు కొన్ని నెలల కిందటే మునీర్ ఐఎస్ఐ చీఫ్ అయ్యారు. అయితే, ఆయన్ను తప్పించాక ఇమ్రాన్ తతనకు సన్నిహితుడైన ఫయాజ్‌ అహ్మద్‌ను ఐఎస్ఐ చీఫ్ చేశారు. తాజా అధికారిక పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ మునీర్‌ పదోన్నతికి మద్దుతుగా నిలిచింది. ఇమ్రాన్‌ ఖాన్‌ కట్టడికి గట్టిగా కృషి చేస్తాడని భావిస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాతో కూడా ఖాన్‌కు ఏమాత్రం పొసగడంలేదు. ఇటీవల కాలంలో బహిరంగంగానే ఆర్మీ చీఫ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

పుల్వామా దాడి వెనుక..

2019 ఫిబ్రవరిలో అసీమ్‌ మునీర్‌ పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న సమయంలో పుల్వామాలో భారత భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే పాక్‌ ఉగ్రవాదులు పనిచేస్తారన్న విషయం తెలిసిందే. అప్పట్లో కీలక సైనిక కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అతడి పాత్ర కీలకం.

భారత్‌పై ఆపరేషన్స్‌లో మునీర్‌కు అనుభవం ఉంది. కొత్త జనరల్‌ నియామకం భారత్‌-పాక్‌ సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. ప్రస్తుత జనరల్‌ బజ్వా 2021లో భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో కొత్త జనరల్‌ విధానం ఎలా ఉంటుందనేది భారత్‌ జాగ్రత్తగా గమనిస్తోంది. గతంలో కమర్‌ జావెద్‌ బజ్వా కింద మునీర్‌  బ్రిగేడియర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2017లో పాక్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌లో డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 30వ కోర్‌ జనరల్‌గా.. అనంతరం క్వార్టర్‌ మాస్టర్‌ జనరల్‌గా పనిచేశారు.

అత్యంత నాటకీయంగా..

ఆర్మీ చీఫ్‌ రేసులో మునీర్‌ చాలా నాటకీయంగా వచ్చి చేరారు. 2018 సెప్టెంబర్‌ ముందు వరకు ఆయన టూ స్టార్‌ జనరల్‌ మాత్రమే. ఆయన ఆ తర్వాత పదోన్నతులతో ఆయన లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఎదిగారు. పాక్‌ సైన్యం నిబంధనల ప్రకారం లెఫ్టినెంట్‌ జనరల్‌గా నాలుగేళ్లు పనిచేస్తేనే ఆర్మీచీఫ్‌గా అవకాశం లభిస్తుంది. బజ్వా పదవీ విరమణ చేయనున్న నవంబర్‌ 29కి సరిగ్గా రెండు రోజుల ముందు (27వ తేదీ)తో లెఫ్టినెంట్‌ జనరల్‌గా మునీర్‌ నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. ఆ రోజు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆయన్ను ఆర్మీచీఫ్‌గా ఎంపిక చేశారు. ఫలితంగా మూడేళ్లు.. అంటే 2025 వరకు మునీర్‌ ఈ పదవిలో కొనసాగే అవకాశం లభిస్తుంది.