Begin typing your search above and press return to search.

ఉక్కు కోసం కదం తొక్కిన కార్మిక లోకం

By:  Tupaki Desk   |   28 March 2022 10:30 AM GMT
ఉక్కు కోసం కదం తొక్కిన కార్మిక లోకం
X
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ కార్మిక లోకం కదం తొక్కింది. విశాఖ వీధుల్లోకి వచ్చి మరీ సింహనాదమే చేసింది. విశాఖ ఉక్కు మా హక్కు మాత్రమే కాదు, మా ఆస్తి, మా గర్వం, మా గౌరవం అని కూడా చాటి చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ బంద్ విశాఖ జిల్లాలో బాగా జరిగింది. ఈ బంద్ కి బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు సహకరించాయి. అదే విధంగా విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు కూడా మూతపడ్డాయి. అదే టైంలో బంద్ కి ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు వచ్చి తమ వంతుగా పాలుపంచుకున్నాయి.

విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం చెప్పడాన్ని కార్మిక లోకం తప్పుపడుతోంది. బంగారం లాంటి విశాఖ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలన్న ఆలోచన మానుకోవాలని కూడా నేతలు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆషామాషీగా ఏర్పడలేదని, ఎంతో మంది అమరుల త్యాగాలు దాని వెనక ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

అదే విధంగా 32 మంది ఆత్మబలిదానం చేశారని, వందలాది మంది జైలు పాలు అయ్యారని, ఎన్నో పోరాటాలు జరిగిన మీదటనే నాడు కేంద్ర పెద్దలు విశాఖలో ప్లాంట్ ని ఏర్పాటు చేశారని వివరించారు దానికి గానూ వేలాది ఎకరాల భూములను స్థానిక ప్రజలు ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల బాటన ఉందని, దాన్ని మరింతగా అభివృద్ధి చేయాలీ అనుకుంటే మాత్రం సొంత గనులు ఇవ్వాలని, ఆర్ధికంగా ఊతమివ్వాలని ఉక్కు ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే విశాఖ బంద్ జయప్రదం అయింది. గతంతో పోలిస్తే జనాల్లో కూడా మంచి స్పందన వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని జనంలోకి తీసుకెళ్లడంలో కార్మిక సంఘాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఈ ఉద్యమాలు అన్నీ విశాఖలో జరుగుతున్నాయి. ఢిల్లీ పెద్దలు మాత్రం వీటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. తమ పని తాము దూకుడుగా చేసుకుని పోతున్నారు.

ఈ క్రమంలో విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఈ ఉద్యమాలు కంటే మరింత ఉధృతమైనవి చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ విషయంలో మలి విడత ఉద్యమాన్ని భారీ ఎత్తున నిర్మిస్తామని కార్మికులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒకక్ట మాట ఉంది. ఏ ఉద్యమం అయినా రాజకీయ పార్టీల సహకారం ఉండాలి. రాజకీయ వత్తిడి కూడా ఉండాలి. అపుడే అవి సక్సెస్ అవుతాయి. కానీ చూస్తే ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడమే ఉక్కుకు పెను శాపంగా మారుతోంది.

ఉక్కు విషయంలో ఒక్కటిగా రావాల్సిన రాజకీయ పార్టీలు తప్పు మీదంటే మీది అని విమర్శలు చేసుకోవడంతోనే బీజేపీ సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్న కేంద్రాన్ని అడ్డుకోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ముందుకు రావాలని అంతా కోరుతున్నారు. మరి అది సాధ్యమయ్యే పనేనా. చూడాలి.