Begin typing your search above and press return to search.

బీజేపీ ఒంటరేనా... ?

By:  Tupaki Desk   |   7 Oct 2021 6:30 AM GMT
బీజేపీ ఒంటరేనా... ?
X
ఏపీ రాజకీయాలు నెమ్మదిగా మారుతున్నాయి. దాదాపుగా ఏడేళ్ల పాటు ఏపీని పరోక్షంగా శాసించిన బీజేపీ ఇపుడు ఎవరికీ కానిదవుతోంది. ఒక విధంగా ఒంటరిగా మారుతోంది. దానికి కారణం జాతీయ స్థాయిలో మారుతున్న పరిణామాలే అని చెప్పాలి. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ కొంత మసకబారుతోంది అన్న అంచనా అయితే ఉంది. ఉత్తరాదిన పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో లఖీం పూర్ ఖేర్ ఘటన బీజేపీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది అంటున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన మాదిరిగా అసలే బీజేపీకి యూపీలో ఎదురుగాలి వీస్తోంది. దానికి తోడు అన్నట్లుగా లఖీంపూర్ ఖేర్ ఉదంతం జరిగింది. ఏకంగా రైతుల మీద నుంచి వాహనాలు దూసుకురావడం, అందులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఉన్నారని ఆరోపణలు రావడంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరో వైపు చూస్తే యూపీలో బీజేపీ ఓటమి పాలు అయితే మాత్రం జాతీయ స్థాయిలో కూడా అతి పెద్ద దెబ్బ పడడం ఖాయం.

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే యూపీ ఎన్నికల ఫలితాలు ఏపీ మీద కూడా పెను ప్రభావం చూపిస్తాయి అని. యూపీలో బీజేపీ ఓడిపోతే ఏపీలో రాజకీయం అంతే వేగంగా మారుతుంది. ఏపీలో ఇప్పటికే మిత్ర పక్షం జనసేన కాస్తా దూరం జరిగింది. అదే సమయంలో టీడీపీకి దగ్గర అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. ఇక టీడీపీ నిన్నటి దాకా బీజేపీ చెలిమి కోసం అర్రులు చాచింది. కానీ ఇపుడు మోడీ గ్రాఫ్ తగ్గిపోతోంది. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి బలం పెరుగుతోంది అన్న లెక్కలతో తర్జన భర్జన పడుతోంది. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా మళ్ళీ మోడీ కేంద్రంలో అధికారంలోకి వస్తారన్న అంచనాలతోనే టీడీపీ ఇన్నాళ్ళూ కమలానికి చేరువ కావాలని చూసింది.

ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదు అన్న నిఖార్సైన లెక్క తేలితే మాత్రం టీడీపీ ప్లేట్ ఫిరాయిచడం ఖాయం. ఇప్పటికే బీజేపీ గూటి నుంచి పవన్ని జాగ్రత్తగా బయటకు తెచ్చే కసరత్తుని టీడీపీ చేపట్టింది. పవన్ ఏపీలో ఈ మధ్య చేసిన టూర్లో చేసిన కామెంట్స్ చూసుకుంటే ఆయన పల్లెత్తు మాట టీడీపీని అనలేదు. పైగా కమ్మ వారిని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు. అంటే ఏపీలో రేపటి రోజున పొత్తులకు ఈ రెండు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం లేదనే తెలుస్తోంది. మరో వైపు చూస్తే బీజేపీకి యూపీలో విజయం దక్కి బలం పెరిగితే 2014 మాదిరిగానే మూడు పార్టీల పొత్తు ఉంటుంది. అలా కాదు అనుకుంటే ఈ కూటమి నుంచి బీజేపీ పోయి మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వచ్చి చేరుతుంది అంటున్నారు.

కాంగ్రెస్ తో ఏపీలో పొత్తు వల్ల అనేక లాభాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఎంతో కొంత వెనక్కు వస్తే అది కచ్చితంగా వైసీపీ ని పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తుంది. అదే విధంగా జాతీయ స్థాయిలో రేపటి రోజున విపక్ష కూటమిని నాయకత్వం వహించే అవకాశాలు అధికంగా కాంగ్రెస్ కే ఉంటాయని టీడీపీ పెద్దలు ఊహిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులను కూడా ఏపీలో కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే ఏపీలో బీజేపీ ఒంటరి అవుతుంది. మరో వైపు జగన్ని ఎదుర్కోవడానికి బలమైన కూటమి కూడా రెడీగా ఉంటుంది. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో.