Begin typing your search above and press return to search.

మోడీ భాషలో ఆయన పాలనకు అర్థమయ్యే సరికొత్త నిరసన

By:  Tupaki Desk   |   27 March 2022 12:02 PM IST
మోడీ భాషలో ఆయన పాలనకు అర్థమయ్యే సరికొత్త నిరసన
X
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ పార్టీ.. తానెప్పుడూ ఎదుర్కోని తీవ్రమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుందన్న సంగతి తెలిసిందే. ఓవైపు ప్రజాదరణ తగ్గటం.. రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో విజయం అన్నది అపురూపంగా మారిపోవటం.. వరుస పెట్టి తగులుతున్న ఎదురుదెబ్బల వేళలోనే.. పార్టీలోని అంతర్గత వ్యవహారాలు సైతం ఆశాజనకంగా లేకపోవటం.. తీవ్రమైన నాయకత్వ లేమి ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఓవైపు తన ఉనికిని చాటుకునేందుకు కిందా మీదా పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు మోడీ పాలనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం వినూత్నంగా ప్లాన్ చేసింది. అయితే.. తాజాగా సంధించిన నిరసన అస్త్రం బాగానే ఉన్నా.. టైమింగ్ విషయంలోనే ఇది సరైనది కాదన్న భావన కలిగేలా ఉంది. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నిత్యవసర ధరలు.. తీవ్రమైన ద్రవ్యోల్బణం.. వరుస పెట్టి పెంచుకుంటూ పోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశ వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ప్లాగ్ షిప్ నిరసన కార్యక్రమం ఏమైనా ఉందంటే అది.. ఈ నెల31న (గురువారం) ఉదయం 11 గంటల వేళలో దేశ ప్రజలంతా తమ ఇంటి ముందు.. బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు ప్రదర్శిస్తూ.. డప్పులు కొడుతూ గంటలు మోగించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించటం కోసం ఇంట్లో దీపాల్ని వెలిగించి.. ఇంటి బయటకు వచ్చి పళ్లాలు మోగించాలని అప్పట్లో మోడీ పిలుపునివ్వటం.. దానికి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావటం తెలిసిందే.

ఈ ఉదంతం గుర్తుకు వచ్చేలా కాంగ్రెస్ పార్టీ తాజాగా ఇచ్చిన పిలుపు ఏ విధంగా వర్కువుట్ అవుతుందన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి కీలక కార్యక్రమాన్ని చేపట్టే వేళలో.. సమయం.. సందర్భం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఇలాంటి పిలుపులకు సానుకూలత ఎంత ఉంటుందో ప్రతికూలత అంతే ఉంటుంది. పిలుపు ఇవ్వగానే సరిపోదు.. అది అనుకున్న రీతిలో ప్రతిస్పందన రాకుంటే.. మోడీ మాష్టారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఏమీ లేదన్న విషయం అర్థమయ్యేలా చేస్తుంది.

అంటే.. ఈ నిరసన కార్యక్రమంతో కాంగ్రెస్ కు లాభం సంగతి తర్వాత నష్టానికే ఎక్కువ అవకాశం ఉందని చెప్పాలి. అంతేకాదు.. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించే వేళలో.. కాలం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఇలాంటి వాటిని పిలుపునిచ్చే వేళలో.. టైమింగ్ చాలా ముఖ్యం. గురువారం వర్కింగ్ డే.

దానికి తోడు ఉదయం 11 గంటల వేళలో.. మోడీ మీద వ్యతిరేకతతో ఎవరైనా నిరసన చేపట్టాలంటే చేస్తున్న పని అడ్డు రావటం ఖాయం. అలాంటప్పుడు ఎంతో మంది తమ నిరసనను తెలియజేయటంలో విఫలమవుతారు. అదే జరిగితే.. ఇప్పటికే నీరసించిన కాంగ్రెస్ కు మరింత నీరసం తప్పించి మరింకేమీ మిగలదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మోడీ ఐడియాల్ని కాపీ కొట్టినంత తేలిగ్గా.. వాటి అమలు ఉండదన్న పాయింట్ కాంగ్రెస్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.