Begin typing your search above and press return to search.

ఈ పీకుడు బాషేంది సార్లూ...?

By:  Tupaki Desk   |   9 April 2022 10:30 AM GMT
ఈ పీకుడు బాషేంది సార్లూ...?
X
పీకుడు భాష ఏపీలో ఎక్కువైంది. ఇది గతంలో లేదా అంటే ఈ మధ్యకాలంలోనే ఈ భాషను బాగా వాడేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే రొడ్డకొట్టుడు ప్రసంగాలతో జనాలు బోరెత్తి ఉంటారని భావించో లేక క్యాచీగా ఉంటుందనో సినీ ఫక్కీలో కొత్త కొత్త డైలాగ్స్ ని పాలిటిక్స్ లోకి తేవడం అలవాటుగా మారింది.

గతం గురించి తరువాత చెప్పుకుందాం, ఇప్పటికి వస్తే ముందుగా పీకుడు భాషను మరోసారి జనాల ముందు పెట్టిన ఘనత అచ్చంగా ముఖ్యంగా వైఎస్ జగన్ దే. ఆయన ఎందుకో నంద్యాల వస్తే చాలు ధాటీగా మాట్లాడేస్తారు. స్థల మహిమో మరేమో తెలియదు కానీ ఆయన నోటి వెంట విపక్షంలో ఉన్నపుడూ పరుష పదజాలమే వచ్చింది. ఇపుడు సరిగ్గా అదే నంద్యాలలో జగన్ నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అంటూ మాట్లాడి విపక్షాలతో పాటు జనాలకూ షాకిచ్చేశారు.

నిజానికి జగన్ చాలా తక్కువ మాట్లాడుతారు, విపక్షాల మీద పెద్దగా నోరు చేసుకోరు అని పేరు. అలాంటి జగన్ ఇలా మాట్లాడడంతోనే విపక్షాం కూడా ఘాటుగానే రియాక్టు అవుతోంది. మూడేళ్లలో ఏం పీకారు అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పీకుడు భాషను కంటిన్యూ చేస్తే లోకేష్ కూడా మీ వెంట్రుకలు పీకే ఓపిక తీరిక మాకు లేవు అంటూనే పీకుడు భాషను తానూ వాడేశారు.

ఇక ఇపుడు చంద్రబాబు కూడా అదే రూట్లోకి వచ్చారు. మీరు విద్యుత్ ని ప్రతీ రోజూ పీకేస్తూ పోతే చివరికి మీ పవర్ ని జనాలు పీకేస్తారు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ అందులో కూడా పీకుడు భాషే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే దీనికి కొంత కాలం ముందు చంద్రబాబు వైసీపీని సవాల్ చేస్తూ మీరేమీ పీకలేరు అంటూ గట్టిగానే మాట్లాడారు.

ఇక లోకేష్ కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు, అరెస్టులతో ఏమీ పీకలేరు అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు. నాడు చంద్రబాబు వంటి సీనియర్ నేత ఇలా మాట్లాడమేంటి అని నోళ్ళు నొక్కుకున్న వైసీపీ నేతలు ఇపుడు తమ నాయకుడే అలాంటి భాషను ప్రయోగించడం పట్ల అవాక్కు అవుతున్నారు. నిజానికి పీకుడు భాష అసభ్యంగానే కాదు వినడానికి కూడా రోత‌గానే ఉంది. దాన్ని ఎవరూ వాడాలనుకోరు. కానీ రాజకీయం ముదిరిపోయి ఎటు చూసినా వేడెక్కిపోతున్న వేళ దాన్నే పవర్ ఫుల్ డైలాగ్ అన్నట్లుగా అటూ ఇటూ ఎడా పెడా వాడేస్తున్నారు.

ఇలా వాడుకుంటూ పోతే కొన్నాళ్ళకు పీకుడు భాష కూడా దైవ నామంలా పవిత్రంగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రస్తావించుకోవాలి. రాజకీయ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్న వారు, వాటిని అందుకోవాలనుకుని చూస్తున్న వారు వాడే భాషనే జనాలు ఆసక్తిగా గమనిస్తారు.

యువత కూడా వాటిని అలవాటు చేసుకోవాలని చూస్తుంది. కాబట్టి మీరేమీ పీకలేరు, మీ తాట తీస్తాం, తోలు తీస్తాం, మోకాళ్ల మీద కూర్చోబెట్టి శిక్షలు వేస్తాం లాంటి దారుణమైన భాషను రాజకీయ నేతలు వాడకుండా ఉంటే మేలు. మరి ఏపీలో అలాంటి సీన్ ఉంటుందా. లేక ఈ లాగుడూ పీకుడూ కంటిన్యూ అవుతుందా. వెయిట్ అండ్ సీ.