Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల కేబినెట్‌కే మొగ్గు.. మ‌ళ్లీ ఆ సామాజిక వ‌ర్గాల‌కే పెద్ద‌పీట‌!

By:  Tupaki Desk   |   15 March 2022 8:20 AM GMT
ఎన్నిక‌ల కేబినెట్‌కే మొగ్గు.. మ‌ళ్లీ ఆ సామాజిక వ‌ర్గాల‌కే పెద్ద‌పీట‌!
X
ఏపీ ప్ర‌భుత్వంలో ఏం చేసినా.. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తు న్న విష‌యం తెలిసిందే. సంక్షేమ‌మైనా.. ప‌థ‌కాలైనా.. ఏం చేసినా.. ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మ‌ళ్లీ విజ‌యం సాధించే వ్యూహాల‌నే అమ‌లు చేస్తున్నార‌ని.. కొన్నాళ్లుగా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఇప్పుడు మంత్రి వ‌ర్గ కూర్పులోనూ.. చేర్పులోనూ.. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో ఇప్పుడున్న మంత్రి వ‌ర్గంలో ఏయే సామాజిక వ‌ర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారో.. వాటిని అలానే ఉంచి.. నాయ‌కుల‌ను మాత్ర‌మేమారుస్తార‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

2019లో ఏపీలో అధికారంల‌కి వ‌చ్చిన వైసీపీ... అనూహ్యంగా ఐదు డిప్యూటీ సీఎం ప‌ద‌వుల‌ను సృష్టించింది. ఇది దేశంలో ఎక్క‌డా లేదు. అలాగ‌ని త‌ప్పు కూడా కాదు. పైగా ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను కూడా కీల‌క సామాజిక వ‌ర్గాల నుంచి ఎంచుకోవ‌డం.. రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపుల‌కు డిప్యూటీ సీఎంలుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు.. ఇక‌, త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌నున్న లేదా ప్ర‌క్షాళ‌న చేయ‌నున్న నేప‌థ్యంలో ఈ ఐదు ప‌ద‌వుల‌ను మ‌ళ్లీ వారికే రిజ‌ర్వ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

అంటే.. ఇప్పుడున్న పుష్ప శ్రీవాణి(ఎస్టీ), నారాయ‌ణ స్వామి(ఎస్సీ), ఆళ్ల నాని(కాపు), అంజాద్ బాషా(మైనా రిటీ), ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌(బీసీ)ల‌ను మార్చినా.. వారి స్థానాల్లో అవే సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కుల కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌భుత్వం ఆయా సామాజి క వ‌ర్గాల‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. ఇది రాజ‌కీయంగా వైసీపీకి క‌లిసి వ‌చ్చే అంశంగా ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

అయితే.. మ‌రికొన్ని వ‌ర్గాలు కూడా ఆశిస్తున్నా.. వారికి వేరే ప‌ద‌వులు ఇచ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఏదేమైనా.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న పూర్తిగా ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే చేయ‌నున్నార‌నేది వైసీపీ టాక్. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.