Begin typing your search above and press return to search.

మంత్రులకు టెన్షన్ తగ్గించే విషయాన్ని చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   12 March 2022 11:30 AM GMT
మంత్రులకు టెన్షన్ తగ్గించే విషయాన్ని చెప్పిన జగన్
X
మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి కాకుండా.. కాస్తంత భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తుంటారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలోనే మంత్రులను రెండున్నరేళ్ల పాటు పదవిలో ఉంటారని.. అనంతరం మరో కొత్త టీం వస్తుందని.. మంత్రులకు వేరే బాధ్యతలు అప్పగించటం జరుగుతుందని స్పష్టం చేసి టెన్షన్ పుట్టించారు.

దీంతో.. మంత్రుల్లో రెండున్నరేళ్ల వరకే తమ పదవులు అన్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేశారు. అయితే.. జగన్ చెప్పినట్లుగా రెండున్నరేళ్లు పూర్తి అయినప్పటికీ మంత్రుల టీంను మార్చింది లేదు.

దీనిపై కసరత్తు జరిగినా.. కొన్ని సమీకరణాల నేపథ్యంలో పాత టీం స్థానే కొత్త టీంను తీసుకురావటం అంత తేలికైన విషయం కాదన్నది సీఎం జగన్ కు అర్థమైందని చెబుతారు. ఈ కారణంతోనే తాను మొదట్లో చెప్పినట్లుగా రెండున్నరేళ్లు పూర్తి అయినప్పటికీ పాత టీంతోనే నడుస్తున్నారు. అయితే.. మంత్రుల్లో మాత్రం ఈ టెన్షన్ చాలానే ఉందన్న విషయం తాజాగా జరిగిన ఏపీ మంత్రిమండలి సమావేశం చెప్పేసింది.

శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రుల మార్పు అంశం చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం జగన్.. మీరెందుకు ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు? మంత్రులుగా మీకు అనుభవం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని గెలుపుబాటలో నడిచేలా చేస్తారు. సమర్థంగా ఆ పదవిని నిర్వహించగలుగుతారు.

అలా అని మిమ్మల్ని తక్కువ చేసినట్లు కాదు కదా? ఇప్పుడు మీకున్న అనుభవంతో ఎన్నికల్లో పార్టీని నడిపించగలరని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.అయితే.. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని కొనసాగించటం గురించి తాను ఆలోచిస్తున్నట్లుగా సీఎం జగన్ పేర్కొన్నారు. అయినా.. అవన్నీ ఇప్పుడు కాదులే.. దానికి వేరే సమయం ఉందంటూ జగన్ నోటి నుంచి వచ్చిన మాటలకు మంత్రుల్లో పలువురు హాయిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఇంతకాలం కొత్త మంత్రుల టీం ఎప్పుడైనా జగన్ ప్రకటిస్తారన్న మాటలకు చెక్ పడిందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రే స్వయంగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఇప్పడల్లా లేదని చెప్పేయటం.. ఆ సమయంలో ఆయన మాంచి మూడ్ లో ఉండటం.. తాను చెప్పిన విషయాన్ని నవ్వుతూ చెప్పటంతో.. కేబినెట్ ను మారుస్తారన్నది ఇప్పట్లో కాకపోవటం ఒక రిలీఫ్ అయితే.. మొదట్లో చెప్పినట్లు కాకుండా.. ఇప్పుడు కొంతమంది మంత్రులు కేబినెట్ లో కొనసాగుతారన్న విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లుగా చెప్పక తప్పదు.