Begin typing your search above and press return to search.

పీకే బుట్టలో మరో స్టార్ హీరో పడిపోయారా?

By:  Tupaki Desk   |   17 March 2022 5:23 AM GMT
పీకే బుట్టలో మరో స్టార్ హీరో పడిపోయారా?
X
రాజకీయాలకు సినిమాలకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా మరో స్టార్ హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెఢీ అవుతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇళయదళపతిగా అభిమానులు పిలుచుకునే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి ఇలాంటి చర్చ రావటానికి కారణం.. ఈ మధ్యనే హైదరాబాద్ లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో విజయ్ భేటీ కావటమే. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్ని టార్గెట్ గా చేసుకొని విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది. విజయ్ ను రాజకీయాల్లోకి రావాలంటూ గడిచిన కొంతకాలంగా ఆయనపై ఒత్తిడి ఉంది. కానీ.. అందుకు విజయ్ సుముఖంగా లేరనే చెబుతారు. ఆ మధ్యన విజయ్ తండ్రి.. 'ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో ఒక పార్టీని రిజిస్టర్ చేయటం.. కొడుకు ఒత్తిడి మేరకు దాన్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే.

విచిత్రమైన విషయం ఏమంటే.. తనకు.. ఆ పార్టీకి సంబంధం లేదని విజయ్ ఎంతగా చెప్పినా.. ఆయన మాటను సైతం పట్టించుకోని వారున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ.. పట్టణ పంచాయితీ ఎన్నికల్లో 'విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో ఉన్న పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తన తండ్రి పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసేందుకు ప్రయత్నిస్తే వెనక్కి లాగిన విజయ్.. తన పేరుతో ఉన్న పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థులను మాత్రం తన ఇంటికి పిలిపించి మరీ వారిని అభినందించిన వైనం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

ఇలాంటి సమయంలోనే పీకేతో విజయ్ భేటీ అయ్యారన్న విషయం బయటకు రావటంతో.. ప్రశాంత్ కిశోర్ కు మరో బలమైన ఖాతాదారు (కస్టమర్) దొరికారన్న మాట వినిపిస్తోంది. ఆయన ట్రాక్ రికార్డు పుణ్యమా అని ఇప్పుడు పలు పార్టీల అధినేతలు ప్రశాంత్ కిశోర్ తో జత కట్టేందుకు..ఆయన్ను తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవటానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా విజయ్ ను రాజకీయాల వైపు చూసేలా చేసిందంటున్నారు.

తమిళనాడులో డీఎంకే సర్కారు ఏర్పడటం.. ఆ పార్టీని వ్యతిరేకించే అన్నాడీఎంకే బీజేపీతో జత కట్టటం తెలిసిందే. దీనిపై గుర్రుగా ఉన్న పలువురు నేతలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక లభించని పరిస్థితి. వారు అన్నాడీఎంకేలో ఉండరు. అదే సమయంలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకేలోకి వెళ్లేందుకు ఇష్టపడరు. అలాంటి వారు విజయ్ ను పార్టీ పెట్టాలని కోరుతున్నారు. దీనికితోడు.. ఈ మధ్యన విదేశీ కారు దిగుమతి కేసుకు సంబంధించి.. ఆయన ప్రతిష్ఠను మంటగలిపేలా సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విజయ్ సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు.

అందుకే.. తన పొలిటికల్ ఎంట్రీ అంశంపై పీకే నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటంతో పాటు భేటీ అయ్యారంటున్నారు. రజనీ పార్టీ పెడతారని ఆశించిన ఆయన అభిమానులకు.. విజయ్ లో రజనీని చూసుకునే వారంతా తమదైన వేదిక కూడా ఎదురుచూస్తున్నారు. తాజా భేటీ వివరాలు బయటకు వచ్చిన నేపథ్యంలో.. పీకే క్లయింట్ల జాబితాలో స్టార్ హీరో నమోదైనట్లే. ఇకపై.. తమిళనాడు రాజకీయాలు కుదురుగా ఉండవేమో?