Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్‌.. ఆ పేరు చెప్ప‌రాదు ఇంకా మొహ‌మాటం ఎందుకు?

By:  Tupaki Desk   |   13 April 2022 4:50 AM GMT
బండి సంజ‌య్‌.. ఆ పేరు చెప్ప‌రాదు ఇంకా మొహ‌మాటం ఎందుకు?
X
తెలంగాణ‌లో బ‌లోపేతంపై బీజేపీ దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డం కోసం సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని రాష్ట్ర బీజేపీ నేత‌లు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అధిష్ఠానం కూడా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చింది. రాష్ట్రంలో క‌ష్ట‌ప‌డితే అధికారంలోకి రావొచ్చ‌నే బీజేపీ హైక‌మాండ్ ఆలోచ‌నే అందుకు కార‌ణం. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీగా మారాయి. మ‌రోవైపు ఉద్య‌మ‌కారుల‌ను, టీఆర్ఎస్ అసంతృప్త నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డంపైనా బీజేపీ దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు ఆ పార్టీలోనే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌య్యాయ‌ని.. బీజేపీ రాష్ట్ర నేత‌లు రెండు వ‌ర్గాలు విడిపోయార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

సీఎం సీటుపై క‌న్నేసి..
తెలంగాణ‌లో బీజేపీ ప‌రిస్థితి రోజురోజుకూ మెరుగ‌వుతోంది. శ‌క్తిమేర క‌ష్ట‌ప‌డితే అధికారంలోకి రావొచ్చ‌నే ధీమాతో ఆ పార్టీ ఉంది. ఒక‌వేళ అధికారంలోకి వ‌స్తే సీఎం ఎవ‌రు? అనేది ఇప్పుడు పార్టీలో ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. చాలా మంది నాయ‌కులు ముఖ్య‌మంత్రి సీటుపై క‌న్నేశార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ప్రారంభ‌మైంద‌ని అంటున్నారు.

అంత‌ర్గ‌త కుమ్ములాటలు ఎక్కువ‌య్యాయ‌ని చెబుతున్నారు. అందుకు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తాజాగా విలేక‌ర్ల‌తో చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు ద‌క్కుతాయ‌ని.. ఇంకా త‌న‌కే సీటు క‌న్ఫార్మ్ కాలేద‌ని ఆయ‌న చెప్పారు. అలాంటిది ఇత‌రుల టికెట్ల విష‌యంలో తాను ఎలా గ్యారెంటీ ఇవ్వ‌గ‌ల‌న‌ని అన్నారు. ఇంకా త‌మ పార్టీలో కొంద‌రు టికెట్లు ఇప్పిస్తామంటూ బీజేపీ నాయ‌కుల‌ను తిప్పుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. కానీ ఆ నాయ‌కుల పేర్లు చెప్పేందుకు మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.

రెండు వ‌ర్గాలుగా..
అయితే బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. బండి సంజ‌య్ వ‌ర్సెస్ కిష‌న్‌రెడ్డి అనేలా పార్టీలో ప‌రిస్థితి మారింద‌ని చెబుతున్నారు. బీజేపీ ప‌రిస్థితి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ లాగా మారుతుంద‌ని అంటున్నారు. అంత‌ర్గ‌త కుమ్ములాటలు ఎక్కువ‌య్యాయ‌ని టాక్‌.

ఇంకా ఎన్నిక‌లు రాలేదు.. పార్టీ గెల‌వ‌లేదు కానీ ఇప్పుడే సీఎం పోస్టు కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వాళ్లు మొద‌లెట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సంజ‌య్‌, కిష‌న్ వర్గాలుగా పార్టీ విడిపోయినా అధిష్ఠానానికి భ‌య‌ప‌డి ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేద‌ని స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ హంగ్ వ‌స్తే మాత్రం బీజేపీ నేత‌లు కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది. అందుకే ఇప్ప‌టి నుంచి పార్టీలో కీల‌క నేత‌లు త‌మ త‌మ వ‌ర్గాల‌ను బ‌లంగా మార్చుకుంటున్నార‌ని చెబుతున్నారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు త‌మ వాళ్ల‌కు ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారని టాక్‌.