Begin typing your search above and press return to search.

పీకే ప్రొడక్షన్ దేశానికి ఏం ఇవ్వనుంది?

By:  Tupaki Desk   |   2 March 2022 4:50 AM GMT
పీకే ప్రొడక్షన్ దేశానికి ఏం ఇవ్వనుంది?
X
దేశ రాజకీయ రంగంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పీకే ప్రొడక్షన్. ఇదెక్కడి ప్రొడక్షన్ హౌస్ అన్న సందేహం అక్కర్లేదు. ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే వారి రాజకీయ వ్యూహ రచన వ్యాపారం ప్రొడక్షన్ హౌస్ కాక మరేంటి? 2014లో దేశ రాజకీయాల్లోకి మోడీని విజయవంతంగా తీసుకురావటమే కాదు.. ఆయన్నో పవర్ ఫుల్ ప్రధానిగా ఎస్టాబ్లిష్ చేసి.. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందేలా చేయటమే కాదు.. ఇవాల్టి రోజున దేశానికి ఆయన తప్ప మరో అధినేతను భూతద్దం వేసుకొని వెతికినా కనిపించని పరిస్థితిని తీసుకొచ్చారు. అలాంటి పీకే మాష్టారు.. ఇప్పుడు మరో మోడీని తయారు చేసే పనిలో తలమునకలై ఉన్నారు.

కొద్ది నెలల క్రితం దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన ఆయన మాటకు కాంగ్రెస్ వాదులంతా ఒక్కసారి పండుగ చేసుకున్నంత పని చేశారు.ఇంకేం ఉంది.. పీకే నోటి నుంచి ప్రధానిగా రాహుల్ అన్న మాట వచ్చేసింది కాబట్టి.. తమ అధినేత పీఎం కుర్చీలో కూర్చోవటం ఖాయమన్న భావనకు వచ్చేసి.. కలలు కనటం మొదలు పెట్టారు కూడా. కానీ.. పీకే అంతలా తపించినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్దగా టెంప్ట్ కాలేదు. తొలుత పీకే సాయాన్ని తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం.. ఆ తర్వాత మాత్రం పీకేతో జట్టు కట్టడానికి.. రాహుల్ ను ప్రధానిగా చేసే టాస్కును పీకేకు అప్పజెప్పేందుకు ఇష్టపడలేదు.

అనంతరం పీకే మౌనంగా ఉండిపోవటం.. ఆ తర్వాత రాహుల్ ను దేశ ప్రధానిగా చేసే పనిని అర్థాంతరంగా ఆపేసి.. కొత్త రేసు గుర్రాన్ని వెతికే ప్రయత్నంలో పడ్డారు. అలాంటి ఆయన.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన కొత్త క్లయింట్ గా చేసుకున్నారు. ఇద్దరు మర మేధావులు కలిస్తే ఎలా ఉంటుందో.. కేసీఆర్ - పీకే కాంబినేషన్ కూడా అలానే ఉంటుందని చెప్పాలి. కేసీఆర్ పార్టీని రానున్న ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చే బాధ్యతను పీకేకు అధికారికంగా అప్పజెప్పినా.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెగ ఆశపడుతున్న గులాబీ బాస్ ను జాతీయ రాజకీయాల్లో సూపర్ హీరోగా లాంఛ్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం దేశానికి నరేంద్ర మోడీని ఇచ్చిన పీకే ప్రొడక్షన్ హౌస్.. ఇప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో అధినేతను దేశానికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇంత పెద్ద దేశంలో.. మేధావులకు ఏ మాత్రం లోటు లేదని.. రాజకీయాల్లో పుట్టి పెరిగి.. అందులోనే దశాబ్దాల తరబడి కొనసాగుతున్న నేతలు.. వారి కుటుంబాలకు 45 ఏళ్ల ప్రశాంత్ కిశోర్ అనే బిహారీ మధ్య వయస్కుడు రాజకీయ నిర్మాతగా మారటం ఏమిటి? ఆయన ప్రొడక్షన్ హౌస్ డిసైడ్ చేసినట్లుగా దేశ ప్రజలు తలాడించాలా? అందుకు సిద్దంగా ఉంటే.. తన క్లయింట్ ను మరో దేశ ప్రధానిని చేసే అవకాశం పీకే ప్రొడక్షన్ హౌస్ కు దక్కించుకున్నట్లే.