Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు వెయ్యి కోట్లు ఇచ్చి.. ప‌ద‌వి పొందారు.. మంత్రి కొట్టుపై టీడీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

By:  Tupaki Desk   |   12 April 2022 11:30 AM GMT
జ‌గ‌న్‌కు వెయ్యి కోట్లు ఇచ్చి.. ప‌ద‌వి పొందారు.. మంత్రి కొట్టుపై టీడీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌
X
ముఖ్యమంత్రి జగన్‌ తన కొత్త కేబినెట్‌లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు చోటు కల్పించడంతో పాటు, ఉపముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టడంతో... విశాఖలోని మధురవాడలో 97.30 ఎకరాల భూమిని ఎన్‌సీసీ సంస్థకు కారు చౌకగా రూ.187 కోట్లకే విక్రయించిన వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. ఎన్‌సీసీ సంస్థ ఆ భూమిని రూ.200 కోట్లకు బెంగళూరుకి చెందిన జీఆర్‌పీఎల్‌ అనే కంపెనీకి అమ్మేసినట్టు వార్తలు రావడం, ఆ కంపెనీ కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళీకృష్ణది కావడంతో... దీని వెనుక భారీ క్విడ్‌ ప్రో కో (నీకది-నాకిది) వ్యవహారం ఉందని విపక్షం టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపించింది.

మధురవాడలో 97.30 ఎకరాల్ని ఎన్‌సీసీ సంస్థకు చెందిన ఎన్‌సీసీవీయూఐఎల్‌కి ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డు 2021 అక్టోబరులో రూ.187 కోట్లకు పూర్తి హక్కులతో విక్రయించింది. ఆ భూమి చేతికి వచ్చాక ఎన్‌సీసీవీయూఐఎల్‌ని ఎన్‌సీసీ సంస్థ జీఆర్‌పీఎల్‌కి విక్రయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఆ భూమిని శరవేగంగా ఎన్‌సీసీకి రిజిస్ట్రేషన్‌ చేయడం, నాలుగు నెలల్లోనే ఆ భూమిని జీఆర్‌పీఎల్‌కి ఎన్‌సీసీ విక్రయించడం, ఆ వెంటనే కొట్టు సత్యనారాయణకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కడం క్విడ్‌ ప్రో కో కాక మరేమిటని విశాఖకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నిస్తున్నారు.

"జగన్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కొన్ని రోజులుగా బయట చర్చ జరుగుతున్నా... మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నవారిలో కొట్టు సత్యనారాయణ పేరు ఎప్పుడూ వినపడలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు కీలకమైన పదవి దక్కడంలోని ఆంతర్యం ఏమిటి?" అని ఆయన బండారు ప్రశ్నించారు.

"మధురవాడలో ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం రూ.60 వేల వరకు పలుకుతోంది. అక్కడ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన విలువే చద‌ర‌పు గజం రూ.22 వేలు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీసీ సంస్థకు ఎకరం రూ.1.93 కోట్లకే విక్రయించింది. అంటే చద‌ర‌పు గజం రూ.4. వేలకే విక్రయించింది. కేవలం రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన విలువ ప్రకారం చూసినా ఆ భూమి విలువ రూ.వెయ్యి కోట్లకుపైనే. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రికి హీనపక్షం రూ.వెయ్యి కోట్ల లబ్ధి చేకూరుతుంది దానికి బదులుగా ఇచ్చిన బహుమతే మంత్రి పదవి. అంటే కొట్టు సత్యనారాయణ పదవి విలువ రూ.వెయ్యి కోట్లన్న మాట.." అని బండారు సత్యనారాయణమూర్తి దుయ్యబట్టారు.

విశాఖలో అదే కొట్టు మురళీకృష్ణకు చెందిన మరో ప్రాజెక్టులోని విశాలమైన స్థలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలాసవంతమైన భవనం నిర్మిస్తున్నారని, వారి మధ్య కుమ్మక్కుకి ఇది మరో నిదర్శనమని ఆయన ఆరోపించారు. "ఎన్‌సీసీ ప్రముఖ నిర్మాణ సంస్థ. అనేక చోట్ల నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడలో తన చేతికి వచ్చిన 97.30 ఎకరాల్లో ఆ సంస్థే స్వయంగా నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టకుండా... జీఆర్‌పీఎల్‌ వంటి కంపెనీకి ఎందుకు విక్రయిస్తుంది? కేవలం విశాఖలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకే ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసి, పదిహేడేళ్లుగా అనేక రకాలుగా ప్రయత్నించి, అత్యంత కీలకమైన సమయంలో భూమి చేతికి వచ్చాక... దాన్ని ఎందుకు వదులుకుంటుంది?" అని బండారు ప్రశ్నించారు.