Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ఎంత కష్టం..సాన పట్టిన కత్తి మొనలా ఈటల మాటలు

By:  Tupaki Desk   |   18 March 2022 5:48 AM GMT
కేసీఆర్ కు ఎంత కష్టం..సాన పట్టిన కత్తి మొనలా ఈటల మాటలు
X
నోటి మాటలతో నీతులు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చేతల విషయానికి వస్తే.. ఆయన తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఓవైపు ఆదర్శాల్ని వల్లిస్తూనే మరోవైపు.. ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజా అసెంబ్లీ సెషన్ ను చూసినప్పుడు ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. వెల్ లోకి రాజాసింగ్ దూసికెళితే.. తమ సీటు నుంచి లేచి మాట్లాడుతున్న ఈటల రాజేందర్.. రఘునందన్ లను సభ నుంచి సస్పెండ్ చేసిన తీరును సొంత పార్టీ నేతలు సైతం తప్పు పడుతున్నారు.

తన నోటి మాటలకు భయపడే.. తనను సభలో లేకుండా చేశారంటూ ఈటల నిప్పులు చెరుగుతున్నారు. ఆయన వాదనను చూసినప్పుడు.. కేసీఆర్ తీరును తప్పు పట్టకుండా ఉండలేం. తప్పు చేయకుండానే శిక్షను విధించిన వైనం ప్రజల మనసుల్లో రిజిస్టర్ అయ్యిందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ మిస్ అవుతున్నారని చెప్పాలి. ఇలాంటి తప్పులు తన మాట మీద ఉండే గౌరవ మర్యాదల్ని తగ్గిస్తాయన్న నిజాన్ని కేసీఆర్ ఎందుకు మర్చిపోతున్నారన్నది ప్రశ్న.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమను సస్పెండ్ చేసిన వైనంపై కోట్లాడుతున్న బీజేపీ.. తాజాగా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరుతో దీక్షా కార్యక్రమాన్నినిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. బాగా సాన పట్టిన కత్తి మొనలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

తన నోటి నుంచి వచ్చే ఒక్కో మాట.. కేసీఆర్ ప్రభుత్వానికి చురుకుపుట్టేలా.. ప్రజల మనసులు ఆలోచనల్లోకి జారేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

'చట్టాన్ని చట్టుబండలు చేసి పార్టీలనే మింగిన ఘనుడు సీఎం కసీఆర్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా.. దాన్ని చట్టుబండలు చేసి 2014లో టీడీపీని మింగిండ్రు. 2018లో కాంగ్రెస్ ను మింగిండ్రు. మజ్లిస్ ఉందని.. కాంగ్రెసోళ్లు వస్తరని నమ్ముకుని ఎన్నికల్లో 30 సీట్లు వచ్చినా సీఎం కావొచ్చని కేసీఆర్ అనుకుంటున్నడు. కానీ.. అది సాధ్యం కాదు. ఎందుకంటే.. నిలబడి.. కలబడి.. కొట్టాడే బీజేపీ ఇక్కడుంది. ఢిల్లీలో ఏదైనా పైరవీ చేస్తే బీజేపీ కలిసి రాకపోతుందా.. అని కేసీఆర్ అనుకుంటున్నరు. బీజేపీతో మిత్రత్వం అన్నది ముగిసిన కథ. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ప్రజా విశ్వాసం కోల్పోయి.. డబ్బునే నమ్ముకున్న కేసీఆర్ కు పీకే అవసరం పడ్డది. ఆయన బెంగాల్ లో ఏం చేసిండు? కాలు విరక్కముందే పట్టేసిండు. ఇక్కడ కూడా మొన్న కసీఆర్్ ను హాస్పిటల్ కు తీసుకుపోయిండు. రూ.600 కోట్లు ఖర్చు చేసినా రూ.4వేల కోట్ల జీవోలు ఇచ్చినా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు మట్టి కరిపించిండ్రు. ఒక హుజూరాబాద్ ఒక తెలంగాణ అవుతుంది. దీన్ని ఆపే శక్తి మీ జేజమ్మకు కూడా లేదు' అని ఈటల మండిపడ్డారు.

ఆయన మాటల్ని విన్నంతనే కేసీఆర్ చేసిన తప్పుల చిట్టా వరుస క్రమంలో చెప్పినట్లుగా అనిపించక మానదు.