Begin typing your search above and press return to search.

టీ కప్పులో తుపానేనా ?

By:  Tupaki Desk   |   12 April 2022 11:02 AM IST
టీ కప్పులో తుపానేనా ?
X
మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న కోపంతో ఉన్న వాళ్ళ ఆగ్రహమంతా టీ కప్పులో తుపాను లాగే అయిపోయింది. మంత్రివర్గంలో చోటు ఆశించిన కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను లాంటి వాళ్ళంతా బాగా అసంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే తాజా మాజీలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత కూడా అలిగారు. మేకతోటి అయితే రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించారు.

అయితే రెండు రోజులు గడిచేసరికి వీళ్ళ కోపమంతా పాలపొంగులా చల్లారిపోయింది. మంత్రి పదవి రాలేదని తనకేమీ కోపం లేదని బాలినేని స్వయంగా ప్రకటించారు. కాకపోతే మంత్రి పదవి పోతే బాధగా ఉంటుంది కదా అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇక మేకతోటి కూడా పదవి పోయినందుకు బాధగా లేదన్నారు. రెండున్నరేళ్ళ క్రితమే రాజీనామాలు చేయాల్సుంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

ఇక కోటంరెడ్డి, కరణం, సామినేని కచ్చితంగా తమకు బాధగా ఉందన్నారు. జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటామని ప్రకటించారు. అంటే అసంతృప్తి మొత్తం చల్లారి పోయిందనే అనుకోవాలి.

ఇదే విషయాన్ని తాజా మాజీ పేర్ని నాని మాట్లాడుతూ తమకు మంత్రిపదవులు వచ్చినపుడు ఎంత సంతోషించామో ఇపుడు వేరే వాళ్ళకి వచ్చినపుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు కదాన్నారు. ఎల్లకాలం తామే మంత్రిపదవుల్లో ఉంటామంటే ఎలాగని నిలదీశారు.

వీలైనంత మందికి మంత్రి పదవులు రావాలంటే ఎంతో కొంతమంది తప్పించాల్సిందే కదా అన్న విషయాన్ని పేర్ని స్పష్టంగా చెప్పారు. అలకలు, అసంతృప్తులంతా మామూలే అని నాలుగు రోజులుండి తర్వాత అంతా సర్దుకుంటుందన్నారు. ప్రభుత్వంలో మంత్రి పదవి ఎంత ముఖ్యమో పార్టీలో పదవి కూడా అంతే ముఖ్యమని కొడాలి నాని అన్నారు.

ప్రభుత్వంలో సేవలందించిన వాళ్ళలో కొందరిని పార్టీకి సేవలందించమని జగన్ చెప్పటంలో తప్పే లేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అసంతృప్తి అంతా టీ కప్పులో తుపాను అన్న పద్ధతిలో చల్లారిపోయిందనే అనుకోవాలి. బాలినేనితో మాట్లాడినట్లే జగన్ మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడితే అంతా సెట్టయిపోతుంది.