Begin typing your search above and press return to search.

వెంటిలేటర్ పై కూడా పిడికిలి బిగించిన మల్లు స్వరాజ్యం..: జీవిత చరిత్ర

By:  Tupaki Desk   |   20 March 2022 10:30 AM GMT
వెంటిలేటర్ పై కూడా పిడికిలి బిగించిన మల్లు స్వరాజ్యం..: జీవిత చరిత్ర
X
కర్ర చేత పట్టి.. ఓవైపు నైజా సర్కారును గడగడలాడించి.. మరోవైపు పెత్తందారుల గుండెల్లో గుబులు పుట్టించిన తెలంగాణ ఆడబిడ్డ మల్లు స్వరాజ్యం మనమధ్య లేరన్న విషయం రాష్ట్ర ప్రజానీకాన్ని కలచివేస్తోంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాన్ని నాటి నాయకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులను చైతన్యం చేయడంలో మల్లు స్వరాజ్యం ప్రత్యేకంగా నిలిచారు.

ఆమె పోరాట స్పూర్తిని చూసి తట్టుకోలేక 1947 -48 కాలంలో పెత్తందారులు పూర్తిగా పారిపోయారు. ఎరుపు బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మల్లు స్వరాజ్యం ఆది నుంచి కమ్యూనిస్టు నాయకురాలిగానే కొనసాగారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చినా పేద ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని భావించారు. అయితే నేటి తరానికి మల్లు స్వరాజ్యం గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఆమె ఎవరు..? ఆమె చేసిన పోరాటాలేంటి..?

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించారు మల్లు స్వరాజ్యం. భీంరెడ్డి రాంరెడ్డి-చొక్కమ్మ ఆమె తల్లిదండ్రులు. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె చదువు ఇంటివద్దనే సాగింది. అయితే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. అలాగే మార్కిజం, గోర్కి రచనలు చదివి 13 ఏళ్ల వయసులోనే సమాజం గురించి తెలుసుకున్నారు. 11 ఏళ్ల వయసులో ఉండగా ఆంధ్రమహాసభ ఇచ్చిన పిలుపునకు హాజరయ్యారు. ఆరోజుల్లో మహిళలు గడప దాటటమే గగనం. అలాంటిది చిన్న వయసులో ఉన్న స్వరాజ్యం ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయినా ఈ సభకు హాజరవడం విశేషం. ఆ తరువాత 13 ఏళ్లు రాగానే సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పేదల పక్షాన పోరాడారు. జానపద పాటలతో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఊరూరా తిరుగుతూ చైతన్యవంతులను చేసేవారు.

ఈ క్రమంలో 1948 సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతమైంది. ఈ పోరాటంలో పాల్గొన్న ఆమె నైజా సర్కారును గడగడలాడించారు. ఈ సమయంలో ఆమెను ఎరుపు బ్రాండ్ గా పేర్కొన్నారు. అనంతరం 1954లో హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వెంకటనర్సింహారెడ్డి దళ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరి వివాహానికి బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, చండ్ర వెంకటేశ్వర్ రావు తదితరులు హాజరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు మల్లు గౌతమ్ రెడ్డి, మల్లు నాగార్జున్ రెడ్డి, కుమార్తె కరుణ జన్మించారు. 2008లో భర్త వెంటకనర్సింహారెడ్డి మరణించారు.

నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిని ఆమెపై అప్పటి ప్రభుత్వం రూ.10 వేల రివార్డు ప్రకటించింది. అయినా గిరిజన ప్రాంతాల్లో తలదాచుకొని పోరాటం కొనసాగించారు. రాజక్క పేరుతో గుర్రపు స్వారీ చేస్తూ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం జాడ తెలుసుకున్న పోలీసులు సైదమ్మ అనే మహిళ ఇంటిపై దాడి చేశారు. అయితే ఆమె తన మూడు నెలల పసికందును స్వరాజ్యంకు ఇచ్చి బాలింత వేషంలో పారిపోవాలని సూచించింది. అయితే ఆ తరువాత పోలీసులు సైదమ్మను పోలీసులు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా స్వరాజ్యం జాడ చెప్పలేదు.

పోరాట పటిమ తరువాత మల్లు స్వరాజ్యం శాసనసభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. 1978 నుంచి 84 వరకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నల్గొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి ‘చైతన్యమానవి’ అనే పత్రికలో పనిచేశారు. ఈ ఏడాది మార్చి 2న తీవ్ర అస్వస్థకు గురైన మల్లు స్వరాజ్యం హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నా ‘లాల్ సలామ్’ అంటూ పిడికిలి బిగించారు.