Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప్రస్తావన తేకుండా ఇన్ని మాటలు కరెక్టేనా తుమ్మల?

By:  Tupaki Desk   |   17 March 2022 2:24 AM GMT
కేటీఆర్ ప్రస్తావన తేకుండా ఇన్ని మాటలు కరెక్టేనా తుమ్మల?
X
అదేం విచిత్రమో కానీ.. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నం టీఆర్ఎస్ పార్టీ. ప్రాంతీయ పార్టీలు ఉన్నా.. గులాబీ పార్టీలోని ఒక విలక్షణత మిగిలిన పార్టీల్లో కనిపించదని చెబుతారు. ఎంత తోపు నేత అయినా సరే.. అధినేత కేసీఆర్ కరుణా కటాక్షాలు ఉన్నంతవరకే. ఒక్కసారి అవి తగ్గిపోతే.. అప్పటివరకు మొనగాడిగా కనిపించిన సదరు నేత సైతం జనాలు మరిచిపోయేలా చేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమనాలి. ఫస్ట్ టర్మ్ లో ఖమ్మం జిల్లా నేత.. మాజీ మంత్రి.. పెద్ద కంప్లైంట్లు లేని నాయకుడిగా చెప్పుకునే తుమ్మల నాగేశ్వరరావు.. కేసీఆర్ కరుణ తగ్గినంతనే ఆయన ఒక్కసారిగా తెరమరుగయ్యారు.

ఆయన దాకా ఎందుకు.. కేసీఆర్ కు కుడిభుజంగా చెప్పుకునే ఆయన మేనల్లుడు హరీశ్ మీద కేసీఆర్ కత్తి కట్టినంతనే.. ఆయన ఫోటో మాత్రమే కాదు.. ఆయన పేరు సైతం గులాబీ బాస్ సొంత మీడియాలో చాలా చాలా కష్టంగా కనిపించేది.

హరీశ్ లాంటి నేత సైతం.. తగ్గుతూనే కనిపిస్తారు. మరి.. ఈ విషయాలన్ని తుమ్మల లాంటి సీనియర్ నేతకు తెలీదా? అంటే తెలీకుండా ఎందుకు ఉంటుంది. మరేం అయ్యిందో కానీ.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని విన్నవారు మాత్రం.. అయ్యో ఇలాంటి తప్పు చేశారే? అన్న భావనకు గురవుతున్నారు.

తాజాగా ఖమ్మం జిల్లాలోని చెరువు మాదారంలోని ఒక ప్రైవేటు ప్రోగ్రాంకు హాజరైన తుమ్మల కోసం.. ఆ గ్రామానికి చెందిన 500 మంది కార్యకర్తలు టూ వీలర్ల మీద.. మరో 50 కార్లతోనూ తుమ్మలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి చెబుతూ.. ఆయనపై పొగడ్తల వర్షం కురిపించేశారు. ఎన్నికల బరిలో దిగి ఈసారి గెలిచి.. మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది.

ఇదంతా ఓకే. అభిమానం ఉన్నప్పుడు ఆ మాత్రం పొగడ్తలు కామన్. కాకుంటే.. తనను పొగిడేసిన తర్వాత మైకు తీసుకున్న తుమ్మల.. తాను మంత్రిగా ఉన్న వేళ.. తాను చేసిన పనుల గురించి చెప్పుకున్నారు. ఇందులో భాగంగా కోదాడ-కురవి నేషనల్ హైవేను కేంద్రమంత్రి గడ్కరీని ఒప్పించి తెప్పించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్ లతో మాట్లాడి రూ.70 కోట్లతో పాలేరు పాత కాలువ పనుల్ని ఆర్నెల్ల వ్యవధిలో పూర్తి చేశానని చెప్పుకున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. అందరి పేర్లు చెప్పిన తుమ్మల.. మంత్రి కేటీఆర్ పేరును మర్చిపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. రాజకీయాల్లో బాగా నలిగిన తుమ్మల లాంటి వారికి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ పేరును మాట వరసకు కూడా మర్చిపోకూడదన్న విషయం తెలీకపోవటం ఏమిటి? ఇలాంటి తప్పులు తుమ్మల లాంటి నేత చేయటమా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.