Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ టూర్.. అందర్ని ఎర్రి పుష్పాల్ని చేశారుగా?

By:  Tupaki Desk   |   2 March 2022 3:00 PM IST
కేసీఆర్ ఢిల్లీ టూర్.. అందర్ని ఎర్రి పుష్పాల్ని చేశారుగా?
X
ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రోజుల నుంచి.. తోక కూడా కనిపించక ముందే.. కొత్త అంచనాల్ని వినిపించే దరిద్రపుగొట్టు రోజుల్లోకి మీడియా వెళ్లిపోతోంది. మేనేజ్ మెంట్లు.. ఛాంబర్లకే పరిమితమయ్యే మీడియా హౌస్ పెద్దల కాకి లెక్కలకు అనుగుణంగా వార్తలు బయటకు వచ్చే రోజులు అంతకంతకూ పెరిగిపోవటంతో.. గ్రౌండ్ లో ఉండే రిపోర్టర్ చెప్పే మాటల కంటే.. తమ మదిలో మెదిలే ఆలోచనలకు పెద్దపీట వేసే పరిస్థితులు నెలకొని ఉండటం.. తెలుగు మీడియా హౌస్ లలో దాదాపు ఇలాంటి తీరే నెలకొని ఉండటంతో ఇప్పుడో సిత్రమైన పరిస్థితి నెలకొంది.

మీడియా ప్రతినిధులకు ఒక పట్టాన కొరుకుడుపడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఎప్పుడు పరీక్ష పెడుతూనే ఉంటుంది. తనకు అవసరమైన వేళ.. అవసరమైనట్లుగా వార్తల్ని మీడియాతో ఎలా ఇప్పించుకోవాలో ఆయనకు తెలిసినంత నేర్పు తెలుగు రాష్ట్రాల్లో మరెవరికీ లేదనే చెప్పాలి. ఆయన దెబ్బకు ఒక్క తెలుగు మీడియాలోనే కాదు.. తెలుగురాష్ట్రాల్లో పని చేసే ఇంగ్లిషు పేపర్ల రిపోర్టర్లకు కూడా ఇదే పరిస్థితి. ఉర్దూ.. హిందీ మీడియా సంస్థలు ఉన్నప్పటికి వాటి సైజు.. షేపు ఏది పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదనే చెప్పాలి.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కో. ఆయన ఢిల్లీకి వెళుతున్నారన్నంతనే.. జాతీయ రాజకీయాల గురించి కన్నేసిన గులాబీ బాస్ షెడ్యూల్ న మీడియానే డిసైడ్ చేయటం.. దానికి తోడు తాను ఫలానా పని మీద వెళుతున్నట్లుగా కేసీఆర్ కానీ.. ఆయన్ను క్లోజ్ గా ఫాలో అయ్యే వారికి పెద్దగా తెలీకపోవటం లాంటి కారణాలతో చాలానే విశ్లేషణలు బయటకు వచ్చాయి. యూపీకి వెళ్లి.. అక్కడ ప్రచారం చేస్తారన్న దానితో పాటు.. ఢిల్లీలో ఉన్న వేళ.. ఆయన పలువురు నేతలతో భేటీ అవుతారని.. కేంద్ర మంత్రులను కలుస్తారని ఇలా చాలానే చెప్పారు.

కట్ చేస్తే.. మంగళవారం ఢిల్లీలో కేసీఆర్ షెడ్యూల్ చూస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు అయ్యే పరిస్థితి. ఎందుకంటే.. ఆయన బయటకు వచ్చింది లేదు. ఎవరిని కలిసింది లేదు. తెలుగు రాష్ట్రాల్లోని మీడియా రాసిన వార్తలతో ఢిల్లీలోని రిపోర్టర్లు అలెర్టు అయి.. కేసీఆర్ ఎక్కడకు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? లాంటి వాటిపై కన్నేయటం.. అసలు విషయాల్ని లాగే ప్రయత్నం చేయటంతో.. ఢిల్లీ టూర్ పరామార్థం బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.

మీడియాలో వచ్చినట్లు కాకుండా.. కేసీఆర్ ఢిల్లీ టూర్ అసలు కారణం.. ఆయన.. ఆయన సతీమణి శోభకు వ్యక్తిగత వైద్య పరీక్షలకు మాత్రమేనట. పనిలో పనిగా.. ఢిల్లీలోని జాతీయ మీడియాకు చెందిన ముగ్గురు.. నలుగురు ఎంపిక చేసిన సీనియర్ జర్నలిస్టులను ఇంటికి పిలిపించుకొని.. వారితో తాజా పరిణామాల మీద మాట్లాడే ప్లాన్ ఉంది తప్పించి.. మరింకేమీ లేదన్న కొత్త విషయం బయటకు వచ్చింది. ఇదంతా చూసినప్పుడు.. మీడియాను ఎర్రి పుష్పం చేయటంలో గులాబీ బాస్ కేసీఆర్ కు మించినోళ్లు లేరనే మాట వినిపిస్తోంది.

కేసీఆర్ ఢిల్లీ టూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ తో భేటీ అవుతారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఇక్కడో ట్విస్టు ఏమంటే..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసలు ఢిల్లీలోనే లేరట. ఆయన వ్యక్తిగత కారణాలతో కర్ణాటకకు వెళ్లారని.. మరో వారం పాటు తిరిగి రారని. ఇదంతా తెలుసుకున్న తర్వాత.. తెలుగు మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్ల ముఖాల్లో నెత్తురు చుక్క లేని పరిస్థితి. ఏమైనా.. కేసీఆర్ దెబ్బకు తెలుగు మీడియా ప్రతినిధులు విలవిలలాడిపోతున్నారట. తమనింత ఎర్రి పుష్పాలను చేసినప్పటికి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.