Begin typing your search above and press return to search.

'బ్లాక్ డే'లు.. ఎమర్జెన్సీలు గుర్తు చేసుకోవచ్చు కానీ పండిట్ల ఊచకోత వద్దా?

By:  Tupaki Desk   |   19 March 2022 9:30 AM GMT
బ్లాక్ డేలు.. ఎమర్జెన్సీలు గుర్తు చేసుకోవచ్చు కానీ పండిట్ల ఊచకోత వద్దా?
X
ఇదెక్కడి అన్యాయం? ఇదెక్కడి దారుణం? అన్నట్లుగా ఉంటుంది కొందరి వాదన విన్నప్పుడు. పేరుకు హిందువులు మెజార్టీలుగా ఉండే ఈ దేశంలో వారికి సంబంధించిన ఎవరైనా గళం విప్పినంతనే వారిని హిందూ ఉన్మాదులుగా.. సంఘ్ పరివార్ సభ్యులుగా ముద్రలు వేయటం ఒక అలవాటు. ఈ రెండు దరిద్రాలకు మూలం రెండే రెండు. అందులో ఒకటి కాంగ్రెస్ భావజాలం అయితే.. మరొకటి వామపక్ష వాదం. రాజకీయ కోణంలో కాంగ్రెస్ హిందువులకు సంబంధించిన అంశాల్ని తొక్కేస్తూ విభజించు పాలించు విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది.

ఇక.. వామపక్షీయులైతే వారికి మించిన మేధావులు మరెక్కడా ఉండరు. నిత్యం పిడివాదన..దానికి అందమైన వాదనలు వినిపిస్తూ.. సెక్యులరిస్టుల పేరుతోనూ.. మానవ హక్కుల వాదుల మాటల్నివినిపిస్తూ.. తాము మాట్లాడే ప్రతి మాటకు అద్భుతమైన ఆదర్శాలు.. అంతకుమించిన లాజిక్కులు వినిపిస్తూ.. కళ్లున్నా కనిపించకుండా చేయటంలో వారు విజయవంతమయ్యారు.

మనం చదివే చరిత్ర.. ఆదర్శాలు వారు రాసినవే తప్పించి ఇంకేమీ కాదు. ఎవరైనా వారికి భిన్నమైన వాదనను వినిపిస్తే చాలు.. హిందుత్వ ముద్ర వేసేస్తుంటారు. తాజాగా కశ్మీర్ ఫైల్స్ మూవీ నేపథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సదరు సినిమాకు పన్ను రాయితీని ప్రకటించినంతనే.. అదేదో బీజేపీ స్పాన్సర్డ్ మూవీగా ప్రచారం చేయటం వారికి మాత్రమే చెల్లుతుంది.

మొదట్లో మౌనంగా ఉన్న ఈ మేధావి బ్యాచ్.. సదరు సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించటంతో ఆగక.. స్వయం ప్రకటిత మేధావులుగా చెలామణీ అయ్యే వారిని.. పండిట్లకు జరిగిన అన్యాయం గురించి మీరెందుకు మాట్లాడలేదన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు.

దీంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారు.. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. అందుకు భిన్నంగా సదరు సినిమాకు ఏదో ఒక మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ లాంటి కుహనా లౌకికవాదులు.. ప్రజాస్వామ్యశీలులు.. మేధావులు.. కశ్మీర్ పండిట్లకు జరిగిన ఆరాచకం గురించి సినిమా తీయటం ద్వారా.. గాయాలు మానతాయా? లేదంటే రేపుతుందా? అంటూ ప్రశ్నించే వైనం చూస్తే.. ఒళ్లు మండక మానదు. ఆయన వాదనే సరైనది భావిద్దాం. మరి.. ఇందిరాగాంధీ తీసుకున్న ఎమర్జెన్సీ గురించి ప్రతి ఏటా మాట్లాడుకోవటం ఎందుకు? అంతెందుకు బ్లాక్ డే పేరుతో హడావుడి చేసే వారికి వంతపాడే ఈ మేధావులు.. వాటికి ఇప్పుడు వల్లె వేస్తున్న సిద్ధాంతం వర్తించాలి కదా?

ఎవరికి లేనివన్నీ.. కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన దారుణ వైనం గురించి ఒక సినిమా ఇన్నేళ్ల తర్వాత వస్తే.. ఎందుకింత ఆక్రోశం? ఎందుకింత ఉలికిపాటు? అన్న సందేహాలు కలుగక మానదు. ఇంతకాలం తాము చెప్పిన సిద్ధాంతాలు.. వల్లెవేసే ఆదర్శాలన్ని మసిపూసి మారేడన్న విషయం ప్రజలకు అర్థం కావటంతోనే ఈ మేధావి బ్యాచ్ అంతా ఇలా మాట్లాడుతుందా? అన్న సందేహం కలుగక మానదు. అన్నింటి గురించి ప్రతి ఏటా మాట్లాడే ఈ బ్యాచ్.. పండిట్ల ఊచకోత గురించి దాదాపు ముఫ్ఫై ఏళ్ల తర్వాత మాట్లాడటం కూడా నచ్చకపోవటం ఏమిటి?