Begin typing your search above and press return to search.

'కశ్మీర్ ఫైల్స్'.. బీజేపీని ఉతికి ఆరేసిన పాత మిత్రుడు

By:  Tupaki Desk   |   21 March 2022 5:30 AM GMT
కశ్మీర్ ఫైల్స్.. బీజేపీని ఉతికి ఆరేసిన పాత మిత్రుడు
X
ఇటీవల కాలంలో ఒక సినిమా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. అదో హాట్ టాపిక్ కావటం.. సినిమాను తప్పనిసరిగా చూడాలంటూ ప్రేక్షకులే ప్రచార కర్తలుగా మారిన మూవీ ఏదైనా ఉందంటే అది కశ్మీర్ ఫైల్స్. వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. నిర్మాతలు సైతం కలలో కూడా ఊహించని భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రగిల్చిన రాజకీయ వేడి అంతా ఇంతా కాదు.

ఈ సినిమాకు అడగకుండానే భారీ రాయితీలు ఇచ్చి అందరి నోళ్లలో నానుతోంది బీజేపీ. తమ పాలన సాగుతున్న రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పన్ను రాయితీ ఇవ్వటమే కాదు.. ప్రధానమంత్రి మోడీ నుంచి బీజేపీ నేతలు ఎక్కడికక్కడ ఈ సినిమాను చూసి కితాబులు ఇవ్వటం లాంటివి చేస్తున్నారు.

ఇలాంటి వేళ ఈ సినిమా గురించి స్పందించింది కమలనాథులు పాత మిత్రుడు శివసేన. నిజానికి కశ్మీరీ పండిట్లు దారుణ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వేళ.. మరే రాజకీయ పార్టీ రియాక్టు కాని సమయంలో.. వారికి అంతో ఇంతో సాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది శివసేన మాత్రమే.

ఆ పార్టీ తాజాగా తమ దినపత్రిక అయిన సామ్నాలో ఒక వ్యాసాన్ని రాసుకొచ్చింది. అందులో కశ్మీర్ ఫైల్స్ పేరుతో బీజేపీ చేస్తున్న నాటకాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ పార్టీ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లు ఆరోపించింది. కశ్మీర్ పండిట్ల కు జరిగిన దారుణ మారణకాండ వేళ కేంద్రంలో వీపీ సింగ్ సర్కారు ఉందని.. ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారిలో బీజేపీకూడా ఉందని గుర్తు చేశారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.

తాము పవర్లోకి వస్తే కశ్మీరీ పండిట్లను తిరిగి రప్పిస్తామని చెప్పిన బీజేపీ హామీ ఇప్పుడు ఏమైందన్న ఆయన.. ఆర్టికల్ 370 రద్దు అయినప్పటికీ ఎందుకలా జరగలేదని ప్రశ్నించారు. ఈ ఫెయిల్యూర్ ఎవరిదని ప్రశ్నించారు. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే అక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుతామన్న హామీ కూడా ఇచ్చారని.. దాని సంగతేమిటని నిలదీశారు.

రానున్న రోజుల్లో గుజరాత్.. రాజస్థాన్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వీలుగానే ఈ సినిమాను బీజేపీ ప్రమోట్ చేస్తుందని మండిపడ్డారు. ఈ సినిమాలో కశ్మీరీ పండిట్ల గురించి మాత్రమే చూపించారని.. సిక్కులను వదిలేశారన్నారు. కశ్మీర్ పండిట్ల ఊచకోత జరిగిన సమయంలో బీజేపీ నేత జగన్మోహనే గవర్నర్ గా వ్యవహరించారంటూ కమలనాథులు ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేశారు.