Begin typing your search above and press return to search.

పవన్ను నిలదీస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు

By:  Tupaki Desk   |   16 March 2022 4:28 AM GMT
పవన్ను నిలదీస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాంగ్రెస్, వామపక్షాలు నిలదీస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా ఉండటం వల్లే రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమిటో చెప్పాలని పవన్ సమాధానం చెప్పాలంటు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ఇస్తుందని పవన్ అనుకుంటున్న రోడ్ మ్యాప్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చేశారు.

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అన్ని పార్టీలతో అవసరమైతే పొత్తులు పెట్టుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై పై నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేని పొత్తుల నుండి ముందు పవన్ కల్యాణే బయటకు వచ్చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేనపుడు ఇంకా పొత్తులో పవన్ ఎందుకుండాలంటు నిలదీశారు.

ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం విషయాలను పవన్ ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు.

విభజన చట్టంలో ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును కేంద్రం తుంగలో తొక్కేసినా పవన్ ఎందుకు నరేంద్ర మోడీని ప్రశ్నించటం లేదో చెప్పాలని నిలదీశారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టినిట్లు తరచు చెప్పుకునే పవన్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ఎప్పుడు ప్రశ్నించారో చెప్పాలన్నారు.

మొత్తానికి కాంగ్రెస్, వామపక్షాల నేతల ప్రశ్నలు చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఆపటం పవన్ వల్ల అయ్యేపని కాదని అర్ధమైపోతోంది. ఎందుకంటే బీజేపీ-వామపక్షాలు కలిసే అవకాశమే లేదని పవన్ కు తప్ప మిగిలిన అందరికీ తెలుసు.

అలాగే బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు కూడా కలిసే ప్రశక్తేలేదని కూడా తెలుసు. విడిగా చూస్తే బీజేపీకి ఎన్నిఓట్లున్నాయో కాంగ్రెస్, వామపక్షాలకూ అన్నే ఓట్లున్నాయి. అసలు ఈ పార్టీలకన్నా నోటాకు పడుతున్న ఓట్లే ఎక్కువ. ఇలాంటి నేపధ్యంలో ప్రభుత్వ ఓట్లు చీలకుండా చూడటమన్నది పవన్ వల్ల కాదని అర్ధమైపోతోంది.