Begin typing your search above and press return to search.

అంద‌రిదీ ఓ మాట‌.. జ‌గ్గారెడ్డిది మ‌రో మాట‌!

By:  Tupaki Desk   |   10 March 2022 7:38 AM GMT
అంద‌రిదీ ఓ మాట‌.. జ‌గ్గారెడ్డిది మ‌రో మాట‌!
X
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాన‌న ప్ర‌క‌టించి ఆ త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి త‌గ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఒక విష‌యంలో ఒక‌లా మాట్లాడుతుంటే.. జ‌గ్గారెడ్డి మాత్రం అందుకు విరుద్ధమైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎవ‌రెన్ని చెప్పినా త‌న‌కు రూటే స‌ప‌రేటు అంటూ అడుగులు వేస్తున్నారు. తాజాగా కేసీఆర్ ప్ర‌క‌టించిన ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలోనూ తమ సొంత పార్టీ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు విభిన్నంగా జ‌గ్గారెడ్డి మాట్లాడారు.

ఆ విమ‌ర్శ‌లు..
రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌పై విప‌క్షాల‌తో పాటు నిరుద్యోగుల్లోనూ అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది. ఇన్ని రోజులు నిరుద్యోగుల‌తో ఆడుకున్న కేసీఆర్‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ఇప్పుడు ఉద్యోగాల భ‌ర్తీ అంటూ కొత్త నాట‌కానికి తెర‌తీశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ ప్ర‌భుత్వం నియ‌మించిన బిశ్వాల్ క‌మిటీనే రాష్ట్రంలో 1.91 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని నివేదిక ఇచ్చింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వెల్ల‌డించారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ 91 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తామ‌న‌డం ఏమిట‌ని? మిగిలిన ల‌క్ష ఉద్యోగాలు ఎందుకు మాయ‌మ‌య్యాయి? అని సంజ‌య్ ప్రశ్నిస్తున్నారు. కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌పై 2018లోనే రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు విడుద‌లైతే నాలుగేళ్లు వృథా చేసిన కేసీఆర్ ఇప్పుడా కేంద్ర ప్ర‌భుత్వాన్ని బ‌ద్‌నాం చేస్తారా అని ఆయ‌న మండిప‌డ్డారు.

కాంగ్రెస్ నేత‌లు సైతం..
మ‌రోవైపు కాంగ్రెస్ నేత‌లు కూడా కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ఉద్యోగ ప్ర‌క‌ట‌న మోస‌మ‌ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం మ‌భ్య‌పెట్టే కుట్ర‌కు తెర‌తీశార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త పీకే సూచ‌న మేర‌కే సీఎం ప్ర‌క‌ట‌న చేశార‌న్నారు. మ‌రోవైపు అదే పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడారు.

ఉద్యోగాల నియామ‌క ప్ర‌క‌ట‌న జారీ చేసిన కేసీఆర్‌ను ఆయ‌న ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. పైగా సొంత స్థ‌లం ఉన్న‌వారికి ఇల్లు క‌ట్టుకునేందుకు రూ.3 ల‌క్ష‌లు కేటాయించ‌డాన్ని కూడా స్వాగ‌తించారు. గ‌తంలో ఆ మొత్తం రూ.5 ల‌క్ష‌లుగా పేర్కొన్నారు. కానీ ఈ బ‌డ్జెట్లు దాన్ని రూ.3 ల‌క్ష‌ల‌కు త‌గ్గించారు. దీనిపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కానీ జ‌గ్గారెడ్డి మాత్రం కేసీఆర్‌ను పొగుడుతూ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

అంతే కాకుండా సీఎంను క‌లుస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అపాయింట్‌మెంట్ కోరుతున్నాన‌ని స‌మ‌యం ఇస్తే వెళ్లి క‌లుస్తాన‌ని ప్ర‌కటించారు.