Begin typing your search above and press return to search.

సద్దుమణిగిన జగ్గారెడ్డి తుఫాను.. కాంగ్రెస్ పార్టీ మారనని జవాబు

By:  Tupaki Desk   |   19 Feb 2022 9:41 AM GMT
సద్దుమణిగిన జగ్గారెడ్డి తుఫాను.. కాంగ్రెస్ పార్టీ మారనని జవాబు
X
నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్ పార్టీలో రేగిన జగ్గారెడ్డి దుమారం సద్దుమణిగింది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీని వీడనని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేయొద్దని పార్టీ అధిష్ఠానం కోరిందని చెప్పారు. మరోవైపు పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ఈ మేరకు సోనియాగాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తన మీద సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు.. దీనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. మరోవైపు ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్‌ నేత వీహెచ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్‌ జగ్గారెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను వీడొద్దని.. పార్టీలోనే ఉంటూ కొట్లాడుదామని వీహెచ్‌ జగ్గారెడ్డికి చెప్పారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని బొల్లి కిషన్‌ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని కోరిన విషయం తెలిసిందే.

జగ్గారెడ్డిని కలిసిన వీహెచ్

శుక్రవారం సాయంత్రానికి జగ్గారెడ్డి పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. శనివారం పత్రికల్లోనూ ఈ విషయం ప్రముఖంగా ప్రచారమైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వెళ్తున్న సమయంలో ఇటు జగ్గారెడ్డి ఉదంతం హాట్ టాపిక్ అయింది.

దీనికితోడు జగ్గారెడ్డిని కాంగ్రెస్‌ సీనియర్ నేత వి. హనుమంతరావు శనివారం ఉదయాన్నే కలిశారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వీహెచ్‌కు తెలిపారు.

మరోవైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్‌.. జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడటం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తన మీద సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు.. దీనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్‌ అన్నారు. తెరాసలో
చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్‌ చేశారని చెప్పారు.

తెరాసకు అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు.

ఎందుకు జగ్గారెడ్డి అలక.. ఏమిటాయన ప్రత్యేకత

జగ్గారెడ్డి అంటే ఫైర్ బ్రాండ్.. బీజేపీతో మొదలుపెట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా ఏ పార్టీలో ఉన్నా ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. సంగారెడ్డి పక్కనున్న చిన్న గ్రామానికి చెందిన జగ్గారెడ్డి బీజేపీ కౌన్సిలర్ ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 2004 ఎన్నికల్లో ఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, వైఎస్ పట్ల అభిమానంతో కాంగ్రెస్ మద్దతుదారుగా మారి టీఆర్ఎస్ పై విమర్శలు గురిపెట్టారు. ఆ పార్టీకి దూరమయ్యారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినా.. వైఎస్ మరణంతో జగ్గారెడ్డి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పక్షాన నిలిచారు. ఏపీ విభజనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. విభజనకు కొద్దిగా ముందు కిరణ్ కుమార్ రెడ్డితో సంగారెడ్డిలో సభ నిర్వహించి సంచలనం రేపారు. ఇక 2014 ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 2018లో మాత్రం గెలిచారు. ఆ మధ్యలో సీఎం కేసీఆర్ మెదక్ లోక్ సభకు రాజీనామా చేయడంతో 2014లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగానూ జగ్గారెడ్డి బరిలో దిగడం గమనార్హం. కానీ, ఆ వెంటనే కాంగ్రెస్ లోకి వచ్చారు.

రేవంత్ కు గురిపెట్టేలా టీఆర్ఎస్ అస్ర్తం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జగ్గారెడ్డికి ఇష్టం లేదు. తాను కూడా అధ్యక్ష రేసులో ఉన్నానంటూ గతంలో చాలాసార్లు ప్రకటించారు. అయితే, రేవంత్ కు పదవి దక్కింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి అసమ్మతిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏకంగా పార్టీ మారతానంటూ ప్రకటించారు. రేవంత్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇందుకు కారణం చెప్పారు. కాగా, ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా ప్రకటించే వరకు వెళ్లింది.

కానీ, టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ కు పీసీసీ ఇచ్చిన సమయంలోనే జగ్గారెడ్డినీ సముచితంగా గౌరవించింది. కానీ, తన ప్రధాన లక్ష్యమైన పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడం జగ్గారెడ్డిని నిరాశకు గురిచేసింది. ఇదంతా అలాఉంచితే.. జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకుని పీసీసీ చీఫ్ రేవంత్ ను టార్గెట్ చేయాలనేది టీఆర్ఎస్ ఎత్తుగడగా చెబుతున్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం కలిసిరావడమే కాక.. రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన వ్యూహమని భావిస్తున్నారు. దీనికితగ్గట్లే.. కాంగ్రెస్ ను వీడితే జగ్గారెడ్డి సొంత పార్టీ పెడతారని వార్తలు వస్తున్నా..

ఆయన అధికార టీఆర్ఎస్ వైపే వెళ్తారని రాజకీయ వర్గాల అంచనా. కాంగ్రెస్ లోని రేవంత్ వర్గం కూడా జగ్గారెడ్డి పార్టీని వీడతారని తమకు ముందే తెలుసునని చెబుతోంది. కాగా, జగ్గారెడ్డి పయనం టీఆర్ఎస్ వైపేనని మరికొందరు పేర్కొంటున్నారు.

ఒకప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయినా.. జగ్గారెడ్డి తదనంతర పరిణామాల్లో ఆ పార్టీని, కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. సమైక్యవాదమూ వినిపించారు. అయితే, అదంతా రాజకీయంగానే అని ఆయన అభిప్రాయం. వ్యక్తిగతంగా ఏనాడూ జగ్గారెడ్డి విమర్శలు చేయలేదని అనుచరులు గుర్తుచేస్తున్నారు.

వాస్తవానికి టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి వెళ్లడం అనేది వినేందుకు అసాధ్యంగా నే కనిపిస్తున్నా.. స్థానిక రాజకీయ అవసరాలు, ఇతర సమీకరణాలు ఇందుకు అవకాశం ఉందని మాత్రం చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ రాజకీయం మారితే సంగారెడ్డి వంటి జిల్లాలో జగ్గారెడ్డి అవసరం. దీన్ని గమనించే.. ఆయనకు వీలైతే మంత్రి పదవి, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ హామీ, నియోజకవర్గంలో పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి వాటిపై ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.