Begin typing your search above and press return to search.

బండి సంజయ్ ను మూడుసార్లు చంపే ప్రయత్నం చేశారా?

By:  Tupaki Desk   |   14 March 2022 4:30 AM GMT
బండి సంజయ్ ను మూడుసార్లు చంపే ప్రయత్నం చేశారా?
X
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా.. తన రాజకీయ ప్రత్యర్థులపై నోటికి పని చెబుతూ విరుచుకుపడటం.. ఎలా పడితే అలా మాట్లాడేందుకు ఏ మాత్రం మొహమాటపడని నేతగా గుర్తింపు పొందిన బండి సంజయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం క్రితం కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే తలిసిన పేరు.. కార్పొరేటర్ గా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఆయన.. తన దూకుడుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులుగా మారారు.

బండికి ముందు వరకు తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన వారంతా.. ఆచితూచి మాట్లాడటం.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరులోనూ తేడా ఉండేది. అందుకు భిన్నంగా బండి తీరు ఉందని చెప్పాలి.

2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చారని చెప్పాలి. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా తన మీద జరిగిన హత్యాయత్నాల గురించి వెల్లడించి షాకిచ్చారు.

సీఎం కేసీఆర్ ను ఇంతలా విమర్శిస్తున్నప్పుడు బెదిరింపులు వస్తుంటాయని.. తనను చంపే ప్రయత్నం కూడా చేశారన్నారు. యువమోర్చాలో ఉన్నప్పుడు తనపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. ఇవన్నీ అలవాటైన అంశాలే కావటంతో తాను లెక్క చేయలేదన్నారు. పైగా ధర్మకార్యంలోనే పని చేస్తూ.. అదే బాటలో నడుస్తూ చనిపోతే అంతకంటే కావాల్సిందేముంది? అన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి.

ఇక.. తన కుటుంబ నేపథ్యం గురించి ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన.. తాను శిశుమందిర్ విద్యార్థినని.. చిన్నప్పుడే సంఘ్ నిర్వహించే శాఖకు వెళ్లేవాడినని చెప్పారు. ఏబీవీపీలో అంచెలంచెలుగా ఎదిగానని.. తర్వాత యువ మోర్చా.. అక్కడే ఆల్ ఇండియా సెక్రటరీగా పని చేసినట్లు చెప్పారు. అడ్వాణీ యాత్ర చేసినప్పుడు వెంకయ్యనాయుడు తనకు అవకాశం ఇచ్చారని.. దీంతో 35 రోజుల పాటు అడ్వాణీతో కలిసి పని చేసే అవకాశం వచ్చిందన్నారు.

సెంట్రల్ ఆఫీసులో ఎన్నికల ఇన్ ఛార్జిగా ఉన్న వెంకయ్యనాయుడి వద్ద పని చేశానన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. తన దగ్గర డబ్బు కూడా లేదన్నారు. డబ్బులు లేకుండా రాజకీయం చేయటం ఇప్పుడు కష్టం కదా? అని ప్రశ్నిస్తే.. "నేను ఉన్నాను కదా?" అని బదులివ్వటం గమనార్హం.