Begin typing your search above and press return to search.

బాలయ్య చిన్నల్లుడికి ఏదీ రూటు...?

By:  Tupaki Desk   |   5 April 2022 5:30 PM GMT
బాలయ్య చిన్నల్లుడికి ఏదీ రూటు...?
X
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మనవడు శ్రీ భరత్ కి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీకి విశాఖ లోక్ సభ టికెట్ దక్కుతుందా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. శ్రీ భరత్ అనూహ్యంగా 2019 ఎన్నికల వేళ విశాఖ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేశారు. కేవలం మూడు వేల ఓట్ల తేడాతోనే ఆయన పరాజ‌యం పాలయ్యారు.

ఇక ఆయనకు అప్పట్లో చివరి నిముషంలో టికెట్ దక్కింది. దానికి ముందు ఆయనకు టికెట్ ఇవ్వాలా వద్దా అన్న చర్చ కూడా నాడు నడించింది అంటారు. దానికి కారణం నారా లోకేష్ అప్పట్లో విశాఖ జిల్లా భీమిలీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. దాంతో ఒక ఫ్యామిలీకి చెందిన ఇద్దరికీ టికెట్లు ఒకే చోట అంటే సామాజిక వర్గ సమీకరణలతో కష్టమని భావించే అలా చేశారు.

అయితే లోకేష్ మంగళగిరికి వెళ్ళిపోవడంతో శ్రీ భరత్ కి ఎంపీ టికెట్ దక్కింది. దీని వెనక బాలక్రిష్ణ లాబీయింగ్ కూడా ఉందని నాడు ప్రచారం జరిగింది. సరే మొత్తానికి శ్రీ భరత్ చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి సత్తా చాటారు. ఆయన విశాఖలోని గీతం విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉంటున్నారు.

దాంతో పాటు తాత ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసత్వంగా ఎంపీ కావాలనుకుంటున్నారు. ఓటమి చెందినా నిరాశపడకుండా ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. ఇప్పటికే చాప కింద నీరులా తనదైన ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇపుడు ఒక ప్రచారం చూస్తే శ్రీ భరత్ కి టికెట్ దక్కదు అని అంటున్నారు. విశాఖ ఎంపీ సీటు విషయంలో పొత్తులు కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు, బీజేపీతోనూ టీడీపీకి పొత్తులు ఉంటాయని అంటున్నారు. ఈ రెండు పార్టీలతో పొత్తులు ఉంటే కనుక కచ్చితంగా ఎంపీ సీటు వారికే వదిలేయాలని టీడీపీ డిసైడ్ అయింది అంటున్నారు. దాంతో శ్రీ భరత్ కి ఇది నిరాశను కలిగించే విషయమే అంటున్నారు.

శ్రీ భరత్ కేవలం పార్టీ నాయకుడు మాత్రమే కాదు, నందమూరి వారి అల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు. కాబట్టి ఆయనకు ప్రయారిటీ ఇవ్వకపోతే ఎలా అన్న చర్చ ఉంది. మొత్తానికి అటు ఇటూ చేసి ఆయనకు విశాఖ ఉత్తరం సీటు ఇస్తారా అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే తాను ఎంపీగా మాత్రమే పోటీ చేస్తాను అని భరత్ అంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అలా కాకపోతే ఆయన పోటీకి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చిన్నల్లుడి టికెట్ విషయంలో మాత్రం చిక్కులు తలెత్తే సీన్ అయితే కనిపిస్తోంది అంటున్నారు.