Begin typing your search above and press return to search.

శోకంలో ఉన్న వివేకా కుమార్తె వద్దకు వచ్చి సంతకం చేయాలన్న పేపర్లో ఏముంది?

By:  Tupaki Desk   |   1 March 2022 4:59 AM GMT
శోకంలో ఉన్న వివేకా కుమార్తె వద్దకు వచ్చి సంతకం చేయాలన్న పేపర్లో ఏముంది?
X
మరో పద్నాలుగు రోజులు గడిస్తే మూడేళ్లు అవుతుంది. అవును.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి 2019 మార్చి 15 (ఆదివారం) తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. తొలుత గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు రావటం.. ఆ తర్వాత అనుమానాస్పద మరణంగా మారటం.. ఆపై దారుణ హత్యగా తేలటం తెలిసిందే. ఒక మనిషి దారుణ హత్యకు గురైన వేళ.. చూసినంతనే చెప్పేయొచ్చు. అందుకు భిన్నంగా హత్యను సాధారణ మరణంగా అభివర్ణించటంతో మొదలైన గందరగోళం అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. తాజాగా బయటకువస్తున్న వివరాలు సరికొత్త సందేహాల్ని తీసుకొస్తోంది.

అన్నింటికి మించిన వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు సీబీఐ విచారణలో భాగంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని.. దాని సారాంశాన్ని చూసినంతనే నోట మాట రాని పరిస్థితి. అంతేకాదు.. సుదీర్ఘంగా ఉన్న వారి వాంగ్మూలంలో కొన్ని అంశాల వద్దకు వచ్చినంతనే.. మరీ.. ఇలా కూడా వ్యవహరించారా? అన్న భావన కలుగక మానదు. అన్నింటికి మించి.. తండ్రి పోయి పట్టెడు శోకంలో ఉండటం ఒక ఎత్తు. అత్యంత ప్రజాదరణ కలిగిన తన తండ్రి దారుణ హత్యకు గురి కావటం..దానిపై సొంతవాళ్లు స్పందిస్తున్న తీరుతో పలు అనుమానాలతో ఉన్న వేళలో.. వారు వ్యవహరించిన తీరుకు సంబంధించిన అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయని చెప్పక తప్పదు.

తన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒక ఉదంతాన్ని ప్రస్తావించి.. తమకు ఎదురైన పరిస్థితుల గురించి చెప్పిన తీరు చూశాక.. వైఎస్ వివేకా హత్యపై కొత్త తరహా సందేహాలు రాక మానవు. ఆయన ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

- పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో మాకు దగ్గరగా అవినాశ్ రెడ్డి కనిపించారు. అదే సమయంలో కడప మాజీ మేయర్‌ సురేశ్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి మా దగ్గరికి వచ్చారు. వారి చేతిలో ఒక పేపర్ ఉంది. అందులో టీడీపీ నేతలు సతీశ్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్‌ రవిపై అనుమానాలున్నట్లు తెలుగులో ఫిర్యాదు రాసుకొచ్చారు.

- ఆ ఫిర్యాదు పేపర్ మీద నా భార్య సునీతను సంతకం పెట్టాల్సిందిగా అడిగారు. ఇందుకు నా భార్య స్పందిస్తూ.. ‘నేను నా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నాను. మీరు రాజకీయ కోణంలో ఫిర్యాదు రాసుకొచ్చారు’ అని సంతకం చేసేందుకు నో చెప్పారు.

- ఇది జరిగిన తర్వాతి రోజు టీవీల్లో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. వివేకాది హత్య అనుకోవటం లేదు.. రక్తపు వాంతులు చేసుకున్నారని చెప్పారు. అందరూ అవినాశ్ రెడ్డిని అనుమానిస్తుండటంతో ఎన్నికల వేళ డ్యామేజీ జరగకుండా రాజకీయ సలహా మేరకే అలా మాట్లాడారని అనుకున్నాం.

- మేం మామయ్య వివేకా ఇంటికి వెళ్లాం. ఇంటిని పరిశీలించాలని అనుకున్నాం. కానీ.. ఇంటికి పోలీసులు తాళం వేసి ఉంచారు. మేం ఇంట్లోకి వెళ్లాలని అనుకున్నాం. ఎన్సీ రాహుల్ దేవ్ శర్మ అక్కడకు వచ్చారు. ఆయన అనుమతి తీసుకొని లోపలకు వెళ్లాం. అక్కడి పరిస్థితుల్ని చూశాం. వివేకా రాసిన చివరి లేఖను ఇవ్వాలని ఎస్పీ అడిగారు. దాంతో ఎంవీ కృష్ణారెడ్డి వద్ద ఉన్న లేఖను తీసుకొని వారికి ఇచ్చేశాం.