Begin typing your search above and press return to search.

వివేకా కేసు- అందరు యూ టర్న్ వీరులేనా ?

By:  Tupaki Desk   |   4 March 2022 2:30 AM GMT
వివేకా కేసు- అందరు యూ టర్న్ వీరులేనా ?
X
మిగిలిన విషయాలు ఎలాగున్నా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాత్రం ముగ్గురు కీలక వ్యక్తులు యూటర్న్ తీసుకోవటం ఆసక్తిగా తయారైంది. ముందుగా చంద్రబాబు నాయుడు విషయం తీసుకుంటే ఆయనకు యూటర్న్ తీసుకున్నారు. చాలా విషయాల్లో యూటర్న్ తీసుకున్నట్లే వివేకాహత్య కేసులో కూడా యూటర్న్ తీసుకున్నారు. తాను అధికారంలో ఉండగానే వివేకా హత్య జరిగింది. తన అవసరం కారణంగా సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు లేదని బ్యాన్ చేశారు.

అందుకనే హత్య దర్యాప్తును సీబీఐకి ఇవ్వకుండా ప్రత్యేకంగా సిట్ విచారణను వేశారు. సిట్ అధికారులు మూడు నెలలు విచారణ కూడా చేశారు. అయితే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

హైకోర్టు ఆదేశాలతో హత్యకేసులో సీబీఐ విచారణ మొదలుపెట్టింది. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో వెంటనే వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు.

ముందేమో సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన జగన్ తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పి యూ టర్న్ తీసుకున్నారు. అధికారంలో ఉండగా సీబీఐ ఎంట్రీపైనే బ్యాన్ పెట్టిన చంద్రబాబు వెంటనే వివేకా కేసులో సీబీఐ విచారణ కావాలని డిమాండ్లు మొదలుపెట్టారు. అంటే జగన్-చంద్రబాబు వైఖరి చూస్తే అధికారంలో ఉన్నపుడు ఒకలాగ ప్రతిపక్షంలో కూర్చుంటే మరోలాగ మారిపోయిన విషయం స్పష్టమైంది.

వీళ్ళిద్దరే యూటర్న్ తీసుకున్నారని అనుకుంటే వివేకా కూతురు సునీత కూడా అలాగే చేశారు. హత్య జరిగిన వెంటనే తన తండ్రి హత్యకు తమ కుటుంబంలో ఎవరికీ సంబంధం లేదని చెప్పారు.

తన తండ్రి హత్య కేసులో తమ కుటుంబసభ్యులైన జగన్ అండ్ కో ను ఇరికించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారంటు అప్పట్లో పదే పదే మీడియా సమావేశంలో ఆరోపణలు గుప్పించారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా జగన్+అవినాష్ రెడ్డే హత్యకు ప్రధాన సూత్రదారులన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే అప్పుడొకలాగ ఇప్పుడొకలాగ మాట్లాడుతున్న సునీత కూడా యూటర్న్ తీసుకున్నట్లే. మరింతమంది ఇన్నిరకాలుగా ఎందుకు యూటర్నులు తీసుకుంటున్నట్లు ?