Begin typing your search above and press return to search.

ఎంపీలలో సగం మంది అవుట్... ?

By:  Tupaki Desk   |   17 March 2022 10:28 AM GMT
ఎంపీలలో సగం మంది అవుట్... ?
X
అధికార వైసీపీ మూడేళ్లకు పాలన చేరువు అవుతున్న వేళ దూకుడు చేస్తోంది.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది ఆ పార్టీ ఆలోచన. దాంతో పాటు మరోసారి దండీగా ఏపీ నుంచి ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రం లో ఏర్పడే కొత్త సర్కార్ వద్ద పరపతి బాగా ఉంటుందని లెక్కలు వేసుకుంటోంది. దాంతో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల పనితీరు మీద కూడా లేటెస్ట్ గా సర్వేలు చేయిస్తోంది.

వైసీపీకి 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. వారిలో నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే దూరంగా ఉంటున్నారు. మిగిలిన 21 మంది పనితీరు ఎలా ఉంది అన్న సర్వే నివేదికలను పార్టీ తెప్పించుకుంటోంది. చాలా మంది ఎంపీలు తమ నియోజకవర్గాలలో ఉండడం లేదని అధినాయకత్వం వద్ద కీలకమైన సమాచారం ఉందిట.

నిజానికి ఎంపీలలో ఎక్కువ మంది తమ వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమందికి బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఢిల్లీ హైదరాబాద్ ల మధ్యనే వారి రాకపోకలు ఉంటున్నాయని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని కోరి మరి తెచ్చి ఇస్తే ఆయన గత మూడేళ్లుగా ఎక్కడా నియోజకవర్గంలో కనిపించడంలేదని సొంత పార్టీ నుంచే ఫిర్యాదులు ఉన్నాయట.

ఆయన బడా బిజినెస్ మ్యాన్. దాంతో పాటు ఆయన ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆదాలకు టికెట్ హుళక్కి అంటున్నారు. ఆయన ప్లేస్ లో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికే టికెట్ ఇస్తారని అంటున్నారు. 2024 నాటికి ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ముగుస్తుంది అని తెలుస్తోంది.

ఆయన పార్టీకి విధేయుడు గా ఉండడమే కాదు నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉండడంతో ఆయనను ఇప్పటి నుంచే ఎంపీగా పోటీ చేయడానికి అలెర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇదే విధంగా విశాఖ ఎంపీ సీటు విషయంలో కూడా మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఆయన పని తీరు మీద కూడా పార్టీ నిశితంగా పరిశీలన చేస్తోంది అంటున్నారు. ఆయన బిల్డర్ గా ఉన్నారు. దాంతో ఆయన పార్టీ యాక్టివిటీ ఎంతవరకూ ఉందన్న దాని మీద ఆరా తీస్తున్నారుట.

ఇక ఉత్తరాంధ్రాలో ఉన్న నలుగురు వైసీపీ ఎంపీలకూ ఈసారి టికెట్ దక్కడం కష్టమే అంటున్నారు. ఇంకోవైపు చూస్తే గోదావరి జిల్లాల్లో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. అమలాపురం నుంచి ఎంపీగా గెలిచిన చింతా అనూరాధ విషయంలో కూడా క్యాడర్ నుంచి విమర్శలు ఉన్నాయి. పైగా వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా గెలుపు అవకాశాలు ఎంత‌వరకూ ఉంటాయ‌న్నది చూసి మార్చుతారు అని తెలుస్తోంది.

మరో వైపు చూస్తే ఈసారి కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపి మంత్రులుగా పనిచేసిన వారిని, సీనియర్ నేతలను ఎంపీలుగా పంపాలన్నది వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీగా ఉందని తెలుస్తోంది. అలా కనుక చూసుకుంటే పట్టుమని పది మంది ఎంపీలకు అయినా మళ్లీ టికెట్లు దక్కేనా అన్న చర్చ అయితే ఉంది