Begin typing your search above and press return to search.

వివేకా హ‌త్య సాక్షుల‌కు వ‌న్ ప్ల‌స్ వ‌న్ సెక్యూరిటీ

By:  Tupaki Desk   |   29 March 2022 7:26 AM GMT
వివేకా హ‌త్య సాక్షుల‌కు వ‌న్ ప్ల‌స్ వ‌న్ సెక్యూరిటీ
X
ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో విచార‌ణ ప‌లు కీల‌క మ‌లుపులు తీసుకుంటోంది. ఇప్ప‌టికే నిందితులుగా భావిస్తున్న వాళ్ల ద‌గ్గ‌రి నుంచి సాక్షుల ద‌గ్గ‌ర నుంచి సీబీఐ వాంగ్మూలాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వ‌స్తుండ‌డంలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌డ‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సాక్షుల‌కు ప్రాణ హాని ఉందంటూ వాళ్ల‌కు భద్ర‌త క‌ల్పించాల‌ని సీబీఐ కోర్టును కోరింది. ఈ మేర‌కు క‌డ‌ప కోర్టు వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో సాక్షుల‌కు భ‌ద్ర‌త‌ను పెంచాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది.

వివేకానంద రెడ్డి ఇంటి వాచ్‌మ‌న్‌గా ప‌నిచేసిన రంగ‌య్య‌కు, మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోర్టు ఆదేశించింది. రంగ‌య్య‌కు గ‌న్‌మెన్‌తో కూడిన వ‌న్ ప్ల‌స్ వ‌న్ భ‌ద్ర‌త‌, ద‌స్త‌గిరికి వ‌న్ ప్ల‌స్ వ‌న్ సెక్యూరిటీ క‌ల్పించాల‌ని సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే గ‌త మూడు నెల‌లుగా వీళ్ల ఇద్ద‌రికీ పోలీసు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న‌ట్లు పోలీసులు కోర్టుకు వివ‌రించారు. కానీ తాజాగా వాళ్ల భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఎస్ఐ స్థాయి అధికారిని నియ‌మించి గ‌న్‌మెన్ల‌తో కూడిన సెక్యూరిటీ క‌ల్పించాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో పాటు సాక్షుల‌కు సాయుధ ద‌ళాల‌తో కూడిన భ‌ద్ర‌త ఇవ్వాలంటూ కోర్టు సూచించింది. కోర్టు ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో రంగయ్య‌, ద‌స్త‌గిరి భ‌ద్ర‌తా ఏర్పాటు విష‌యంలో పోలీసుల అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు.

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో విచార‌ణ‌ను సీబీఐ ముమ్మ‌రం చేసింది. సాక్షుల వాంగ్మూలాలు.. అవ‌స‌ర‌మైన ఆధారాలు సేక‌రించి భ‌ద్ర‌ప‌రుస్తోంది. ఈ నేప‌థ్యంలో నిందితుల‌కు నోటీసులు అందించే ప్ర‌క్రియ‌నూ మొద‌లెట్టింది. త్వ‌ర‌లోనే వాళ్ల అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను ర‌ద్దు చేయాలంటూ సీబీఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు వివేకా హ‌త్య కేసులో దోషుల‌తో పాటు సాక్షుల‌కు ప్రాణ హాని ఉందంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కేసు విచార‌ణ‌ను వేగ‌వంతం చేసి దోషుల‌ను తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.