Begin typing your search above and press return to search.

మొదలైన యోగీ మార్కు పాలన

By:  Tupaki Desk   |   16 March 2022 6:34 AM GMT
మొదలైన యోగీ మార్కు పాలన
X
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ మార్క్ పాలన మొదలైపోయింది. గ్యాంగ్ స్టర్ కబ్జాలో ఉన్న పెద్ద భవంతిని, మార్కెట్ భవనాలను బుల్డోజర్లతో కూల్చేశారు అధికారులు.

మీరట్ లో బదన్ సింగ్ బడ్డూ అనే గ్యాంగ్ స్టర్ ఉన్నాడు. ఈయన మున్సిపల్ పార్క్ ను కబ్జా చేశాడు. పార్క్ లోనే ఒక పెద్ద ఫ్యాక్టరీ, రేణు గుప్తా పేరుతో పెద్ద భవంతిని నిర్మించాడు. దీన్ని మొదట్లో స్థానికులు ఎంత వ్యతిరేకించినా ఆపలేకపోయారు. పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకపోయింది.

ఎన్నికల రెండోసారి ముఖ్యమంత్రి అయిన యోగి దృష్టికి ఈ విషయం వచ్చింది. వెంటనే మీరట్ మున్సిపల్, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి విషయం ఏమిటో యోగి తెలుసుకున్నారు. పార్కులో నిర్మించింది అక్రమకట్టడాలే అన్న విషయం నిర్ధారణ చేసుకున్నారు. వెంటనే భవనాలు కూల్చేసేందుకు అవసరమైన లీగల్ పర్మిషన్లన్నింటినీ తీసుకున్నారు. మంగళవారం ఉదయమే పార్కుస్థలం దగ్గరకు బుల్డోజర్లను తీసుకుని మున్సిపల్, పోలీసు అధికారులు చేరుకున్నారు.

ఫ్యాక్టరీ, భవనంలోని వారికి విషయం చెప్పి వాళ్ళందరినీ బయటకు వచ్చేయమని హెచ్చరించారు. దాంతో వాళ్ళు అధికారులను ప్రతిఘటించారు. అయితే అధికారులు వాళ్ళని పట్టించుకోకుండా వెంటనే భవనాలను కూల్చేయటం మొదలుపెట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం ఫ్యాక్టరీతో పాటు ఇతర భవనాన్ని కూడా నేలమట్టం చేసేశారు. ఎక్కడో పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ మీరట్ రావటానికి భయపడ్డాడు. దాంతో అధికారులు యధేచ్చగా అక్రమ భవనాలన్నింటినీ కూల్చేశారు.

యోగి మొదటి ఇన్నింగ్స్ దెబ్బకు పెద్ద పెద్ద మాఫియా లీడర్లలో చాలామంది ఎన్ కౌంటర్లయిపోయారు. మిగిలిన వారిలో చాలామంది ఇతర రాష్ట్రాలకు పారిపోగా కొందరు స్వచ్చంధంగా జైలుకెళ్లి కూర్చున్నారు. కొందరైతే బెయిల్ వచ్చినా బయటకు వచ్చేది లేదని చెప్పి ఎన్ కౌంటర్ల భయంతో జైలులోనే కూర్చుంటున్నారు. ఇపుడు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యోగి గ్యాంగ్ స్టర్ కబ్జా భవనాల కూల్చివేత మొదలుపెట్టారు. తొందరలోనే ఇలాంటివి ఇంకెన్ని బయటకు తీసి కూల్చేస్తారో చూడాలి. మొత్తానికి యోగి దెబ్బకు పార్కు చుట్టుపక్కల జనాలు హ్యపీగా ఫీలవుతున్నారు.