Begin typing your search above and press return to search.

టీడీపీ అభ్యర్ధిగా వాణి పోటీచేస్తారా ?

By:  Tupaki Desk   |   21 March 2022 12:02 PM IST
టీడీపీ అభ్యర్ధిగా వాణి పోటీచేస్తారా ?
X
రాబయే ఎన్నికల్లో నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున సినీనటి వాణి విశ్వనాధ్ పోటీచేయబోతున్నారా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఏమిటంటే రాజధాని అమరావతి ఉద్యమ నేపథ్యంలో ఒక సినిమా రెడీ అవుతోంది. ఇందులో వాణీ విశ్వనాధ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ అమరావతి ప్రాంతంలో జరుగుతోంది. అమరావతి ఉద్యమ నేపథ్యంలో తీస్తున్న సినిమాలో వాణి విశ్వనాథ్ నటిస్తున్నారు కాబట్టే ఆమె పోటీపై చర్చ మొదలైంది.

2019 ఎన్నికల్లోనే ఆమె నగిరిలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. ఆమె కూడా అప్పట్లో నియోజకవర్గంలో తిరిగారు. మళ్ళీ ఏమైందో తెలీదు కానీ వాణికి టికెట్ దక్కలేదు. సీన్ కట్ చేస్తే మళ్ళీ కొద్దిరోజులుగా ఆమె యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో రెగ్యులర్ గా కనబడుతున్నారు. సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు కూడా ఆమె చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. నగిరిలో పోటీ చేసే విషయంలో తగిన హామీ లభించిన తర్వాతే వాణి సినిమా షూటింగ్ లో నటిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

సో, పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేయాలన్న పట్టుదలతో వాణి ఉన్నారట. ఇదే విషయాన్ని నగిరిలో వాణీ విశ్వనాధే ప్రకటించారు. ఏ పార్టీ తరపున పోటీచేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వాణి విశ్వనాధ్ కు టికెట్ ఇవ్వాలని లోకల్ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ర్యాలీలు తీశారు. ఇదే సమయంలో వాణి తమ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయని టీడీపీ నేతలంటున్నారు. మరి ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే విషయం వాణియే చెప్పాలి.