Begin typing your search above and press return to search.

పుతిన్ యుద్ధ నేరస్థుడా ?

By:  Tupaki Desk   |   18 March 2022 5:20 AM GMT
పుతిన్  యుద్ధ నేరస్థుడా  ?
X
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను యుద్ధ నేరస్థుడిగా నిర్ధారించటం సాధ్యమేనా ? యుద్ధ నేరస్థుడిగా పుతిన్ ను విచారించటం, శిక్షించటం జరిగే పనేనా ఇపుడిదే విషయాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగినందున పుతిన్ ముమ్మాటికి యుద్ధ నేరస్ధుడే అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. దాంతో పుతిన్ వ్యవహారంపై అంతర్జాతీయంగా చర్చలు మొదలైపోయాయి.

పుతిన్ పై యుద్ధ నేరస్ధుడని ముద్రవేసి విచారణ జరపటం, శిక్షవేసి అమలు చేయటం జరిగే పని కాదు. ఎందుకంటే రష్యా ఎంత శక్తిమంతమైన దేశమో అందరికీ తెలుసు. ఏదో ముక్కు మొహం తెలీని దేశమంటే అగ్రరాజ్యాలు ఏమి చేసినా అడిగేవారు ఉండరు కాబట్టి ఆ నిర్ణయాలు చెల్లిపోతాయి. కానీ రష్యా విషయంలో అలా కాదు. పుతిన్ ను ఏ దేశమైనా టచ్ చేస్తే తర్వాత ఏమి జరుగుతుందో ప్రపంచదేశాలకు తెలియంది కాదు. పుతిన్ కు భయపడే ఉక్రెయిన్ కు మద్దతుగా బాహాటంగా నాటో దేశాలు తమ సైన్యాలను పంపలేదు.

సైన్యాలనే పంపలేని దేశాలు ఇక పుతిన్ ను పట్టుకుని అంతర్జాతీయ కోర్టుకు తీసుకొచ్చి విచారించటం సాధ్యమేనా ? ఉక్రెయిన్ పై యుద్ధం చేయటం నేరమే అని నెదర్లాండ్స్ లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చెప్పినా పుతిన్ ఏమాత్రం లెక్క చేయలేదు. దాంతో ఏమి చేయాలో తెలీక అంతర్జాతీయ న్యాయస్ధానం దిక్కులు చూస్తోంది. పుతిన్ పై చర్యలు తీసుకోవాల్సిందే అని 44 దేశాలు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాయి.

సైనికావసరాల కోసం కాకుండా యధేచ్చగా ఊచకోతకు దిగటం, ఆస్తుల స్వాధీనం, విచ్చలవిడి విధ్వంసానికి పాల్పడటం లాంటి వాటిని యుద్ధ నేరాలుగా పరిగణిస్తారు. నిజంగానే ఇలాంటి వాటిని పట్టుకుని పుతిన్ ను యుద్ధ నేరస్థుడిగా ముద్ర వేయాలంటే అమెరికా అధ్యక్షులపైన కూడా ముద్ర వేయాల్సుంటుంది. ఇరాక్ పైన, ఆఫ్ఘనిస్థాన్ పైన అమెరికా ఏకపక్షంగానే యుద్ధం చేసిన విషయం ప్రపంచదేశాలకు తెలిసిందే. మరి పుతిన్ పై చివరకు ప్రపంచ దేశాలు ఏమి చేస్తాయో చూడాల్సిందే.