Begin typing your search above and press return to search.

బంగారు రోహిత్.. ఆడిందల్లా గెలుపే

By:  Tupaki Desk   |   28 Feb 2022 1:30 PM GMT
బంగారు రోహిత్.. ఆడిందల్లా గెలుపే
X
కొత్త కుర్రాళ్లతో బ్యాటింగ్ లో ప్రయోగాలు చేసినా.. అనుభవం లేని పేసర్లతో బరిలో దిగినా.. నిఖార్సయిన ఆల్ రౌండర్లు లేకున్నా రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా దూసుకెళ్తోంది. శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సిరీసే దీనికి ఉదాహరణ. ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ లో శ్రేయస్‌ను మూడో స్థానంలో, జడేజాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి మంచి ఫలితాన్ని రాబట్టాడు. ‘‘ప్రస్తుతం రోహిత్‌ ఏది ముట్టుకున్నా బంగారమవుతుంది. అతడితో కరచాలనం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఆటగాళ్లను రొటేట్‌ చేయడం, బౌలింగ్‌ దాడిలో మార్పులు... ఇలా ప్రతి అడుగు విజయవంతమే’’ అంటూ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చెప్పడమే రోహిత్ హవా ఏ స్థాయిలోసాగుతుందో తెలుసుకునేందుకు నిదర్శనం.

దీనికితగ్గట్లే వరుసగా మూడు టీ20 సిరీస్‌లను రోహిత్ నాయకత్వంలోని ట్టు గెలుచుకుంది. గతేడాది కివీస్‌పైనా.. ఈ సంవత్సరం విండీస్‌, లంకపై సిరీస్‌లను పట్టేసింది. రోహిత్ స్వదేశంలో అత్యధిక టీ20లు గెలిచిన సారథిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్‌ భారత్‌లో 17 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపట్టగా 16 మ్యాచ్‌లు గెలుపొందాడు. 15 విజయాలతో ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లాండ్‌), కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలానే వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి పొట్టి ఫార్మాట్‌లో టీమిడియా దిగ్విజయంగా సాగుతోంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు దూసుకెళ్లింది.

ఈ ఊపు సాగాలి.. ప్రపంచ కప్ కొట్టాలి

రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా వ‌రుస‌గా 12వ విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో అతడి కెప్టెన్సీపై అంత‌టా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. వ‌రుస పెట్టి ప్ర‌త్య‌ర్థుల‌ను వైట్‌వాష్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే మూడు టీ20 సిరీస్‌ల్లో ప్రత్య‌ర్థుల‌ను క్లీన్‌స్వీప్ చేసింది. గ‌తేడాది చివ‌ర్లో న్యూజిలాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడింది. 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కూడా 3-0తో నెగ్గింది. తాజాగా శ్రీ‌లంక‌ను కూడా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మధ్య‌లో వ‌న్డే ప్రార్మాట్‌లోనూ వెస్టిండీస్‌ను టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. ఆ వ‌న్డే సిరీస్‌ను కూడా క‌లుపుకుంటే హిట్‌మ్యాన్ కెప్టెన్సీ చేప‌ట్టాక టీమిండియా వ‌రుస‌గా 4 సిరీస్‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను వైట్‌వాష్ చేయ‌డం విశేషం. రోహిత్ కెప్టెన్సీ చేప‌ట్టి 3 నెల‌లు గ‌డుస్తుండ‌గా అత‌ని నాయ‌క‌త్వంలో టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వ‌రుస‌గా 12 మ్యాచ్‌ల్లో భార‌త్ గెలిచింది.

విదేశాల్లోనూ విజయ భేరి మోగిస్తే

రోహిత్ కెప్టెన్ అయ్యాక సాధించిన సిరీస్ లన్నీ భారత్ లో జరిగినవే. విదేశాల్లో అసలు సవాల్ ఎదురుకానుంది. అక్కడి పేస్, బౌన్స్ పిచ్ లపై ప్రత్యర్థుల బౌలింగ్ ను ఎదుర్కొంటూ పరుగులు చేయడమే కాక.. బ్యాట్స్ మన్ ను నిలువరిస్తూ గెలవడం మాటలు కాదు. కాగా, రోహిత్ కెప్టెన్సీలో భార‌త్ ఇంకా విదేశాల్లో ప‌ర్య‌టించ‌లేదు. పరాయి దేశాలకు వెళ్లినప్పడూ ఇదే జోరును ప్ర‌ద‌ర్శించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

85 శాతం విజయాలతో..

రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు 28 మ్యాచ్ లాడిన భారత్ 24 గెలిచింది. ఇదో రికార్డు. విజయాల శాతం 85గా ఉంది. 13 వ‌న్డే మ్యాచ్‌ల్లో 11 గెలిచింది. గెలుపు శాతం 84గా ఉంది. ఇదే ఊపుతో ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గనున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెల‌వాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రికొంత‌మంది రోహిత్‌శ‌ర్మ‌ది గోల్డెన్ హ్యాండ్ అంటూ కొనియాడుతున్నారు. హిట్‌మ్యాన్ ఏది ప‌ట్టిన బంగార‌మే అవుతుందంటున్నారు. కాగా రోహిత్ కెప్టెన్సీలో ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ 5 సార్లు ట్రోఫీ గెలిచిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌లంక‌పై ఆదివారం సాధించిన విజ‌యంతో టీమిండియా రికార్డు సృష్టించింది.

ఈ ఫార్మాట్‌లో వ‌రుస‌గా 12వ విజ‌యాన్నిన‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా 12 విజ‌యాలు సాధించిన ఆఫ్ఘ‌నిస్థాన్, రోమేనియా రికార్డును టీమిండియా స‌మం చేసింది. గ‌త ఏడాది టీ20 ప్రపంచ‌క‌ప్ లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం తర్వాత టీమిండియా మరో ఓటమిని ఎదుర్కొనలేదు.