Begin typing your search above and press return to search.

పోలవరం ఫైట్: మేఘానే గెలిచింది.. వెనక్కి తగ్గిన జేపీ వెంచర్స్

By:  Tupaki Desk   |   23 March 2022 11:44 AM GMT
పోలవరం ఫైట్: మేఘానే గెలిచింది.. వెనక్కి తగ్గిన జేపీ వెంచర్స్
X
పోలవరం ప్రాజెక్ట్ వద్ద నెలకొన్న ఇసుక వివాదం ముగిసింది. ప్రాజెక్ట్ పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ తరలిస్తున్న ఇసుకను జేపీ వెంచర్స్ అడ్డుకోవడంతో మంగళవారం పోలవరంలో గందరగోళం నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం , జలవనరుల శాఖ జోక్యంతో ఇసుక సరఫరాను పునరుద్దరించారు. మేఘా ఇంజనీరింగ్ కు చెందిన ఇసుక టిప్పర్లను అడ్డుకోవడంపై ఇసుక కాంట్రాక్టర్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ క్షమాపణ తెలిపింది.

క్షేత్రస్థాయిలో సమన్వయలోపం వలన సమస్య ఏర్పడిందని జేపీ సంస్థ పేర్కొంది. మేఘా ఇసుక లారీలను అక్రమ రవాణాగా పొరపాటు పడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని జేపీ వెంచర్స్ తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరిస్తామని వెల్లడించింది. బుధవారం ఉదయం ఇసుక లారీలు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఇసుక తరలింపును మొదలు పెట్టాయి.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇసుకను సరఫరా చేసే కాంట్రాక్టును జేపీ సంస్థ దక్కించుకుంది. అయితే పోలవరం పరిధిలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇసుకను వాడుకోవడానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. కానీ అనుమతులు ఉన్నా ప్రాజెక్ట్ కు గోదావరి నుంచి ఇసుక తీసుకెళ్లడానికి లేదంటూ జేపీ కంపెనీ సిబ్బంది మేఘా టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇసుక సరఫరా చేస్తున్న 250 టిప్పర్లు నిలిచిపోయాయి. దీనిపై ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు మాట్లాడినా జేపీ సిబ్బంది లెక్కచేయలేదన్న ప్రచారం సాగింది.

పోలవరం ప్రాజెక్టు పరిధిలో 10 కి.మీల లోపల ఇసుక, మట్టి తీసుకోవడానికి మేఘా సంస్థకు ప్రభుత్వం అనుమతిలిచ్చింది. అక్కడికి జేపీ సంస్థకు అధికారాల్లేవు. కానీ ఇక్కడ అడ్డుకోవడం దుమారం రేపింది.

ఇసుక టిప్పర్లను తీసుకెళ్లేందుకు వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ అధికారులను సైతం జేపీ సంస్థ సిబ్బంది అడ్డుకోవడంతో టిప్పర్లు నిలిచిపోయాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో జేపీ సంస్థ దెబ్బకు దిగివచ్చింది. ఇసుక వివాదాన్ని పరిష్కరించింది. జేపీ సంస్థ క్షమాపణ చెప్పింది. వివాదం సద్దుమణగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.