Begin typing your search above and press return to search.

పెద్దన్న పవనే... పల్లకీ మోయాల్సింది టీడీపీనే... ?

By:  Tupaki Desk   |   15 March 2022 9:53 AM IST
పెద్దన్న పవనే... పల్లకీ మోయాల్సింది టీడీపీనే... ?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ పక్కా క్లారిటీతో ఉన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పాత్ర ఏంటి అన్న దాని మీద ఆయన పూర్తి అవగాహనతోనే ఆవిర్భావ సభలో గంటన్నర స్పీచ్ ఇచ్చారని అంటున్నారు. పవన్ పొత్తులకు సిద్ధమే అంటూ కండిషన్ కూడా పెట్టారు. అదే ఇపుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

అదేంటి అంటే తాను ఏపీ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటాను అని పవన్ తెగేసి చెప్పేశారు. అలాగే 2024లో జనసేన అధికారంలోకి కచ్చితంగా వస్తుంది అని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ వికాసం కోసం అంతా చేతులు కలపాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. ఈ విషయంలో వ్యక్తిగత లాభాలూ, ప్రయోజనాలు పక్కన పెట్టాలని ఆయన కోరుతున్నారు.

అలా కనుక ఎవరైనా ముందుకు వస్తే పొత్తులకు తాము సిద్ధమని పవన్ చెప్పకనే చెప్పేశారు. అంటే దీని భావం చూస్తే టీడీపీ పొత్తులకు కనుక తమతో సిద్ధపడితే ఏపీ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్దతు ఇవ్వాల్సిందే అన్నదే అంటున్నారు. దానికి మరో అర్ధం కూడా ఉంది. ఇంతకాలం తాము టీడీపీకి మద్దతు ఇచ్చాం, ఇపుడు తమకు టీడీపీ మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు అన్న మాట.

ఇక బీజేపీని వదులుకోవడానికి పవన్ ఇష్టపడడం లేదు అన్నది ఆయన ప్రసంగం ద్వారా స్పష్టమవుతోంది. పైగా 2024 ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అన్న లెక్కలు కూడా ఆయనకు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు కూడా పవన్ ఆలోచనలలో ఉన్నాయని తెలుస్తోంది.

దాంతో బీజేపీ జనసేన కూటమికి ఎవరైనా మద్దతు ఇవ్వవచ్చు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నదే ఆయన వాదన. ఇక బీజేపీ ఎటూ పవన్ని సీఎం క్యాండిడేట్ గా ఇప్పటికే ప్రకటించింది. దాంతో టీడీపీ రేపటి రోజున పొత్తులకు సిద్ధపడినా కూడా పవన్ సీఎం అన్నది అంగీకరించే రావాల్సి ఉంటుంది.